Telugu Global
Andhra Pradesh

జగన్ హెలికాప్టర్ ప్రయాణంపై జనసేన కార్టూన్

జగన్ హెలికాప్టర్ పర్యటనపై జనసేన తరపున ఓ కార్టూన్ కూడా వేశారు. 20 అయినా, 20వేల కిలోమీటర్లయినా సారు నేలమీద పొయ్యేదేలే, తగ్గేదేలే.. అంటూ కార్టూన్ తో సెటైర్లు పేల్చారు.

జగన్ హెలికాప్టర్ ప్రయాణంపై జనసేన కార్టూన్
X

ముఖ్యమంత్రి చార్టర్ ఫ్లైట్ లో వెళ్లడం సహజమే, హెలికాప్టర్లో ప్రయాణించడం కూడా విశేషమేమీ కాదు. కానీ జనసేన నాయకులు మాత్రం ఆయన హెలికాప్టర్ ప్రయాణంపై జోకులు పేలుస్తున్నారు. కార్టూన్లు వేసి వైసీపీ నేతల్ని కవ్విస్తున్నారు. తాజాగా తెనాలి పర్యటన కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ హెలికాప్టర్లో వెళ్లడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. గుంతలు తేలిన రోడ్డుపై వెళ్లలేకే జగన్ హెలికాప్టర్ ని ఆశ్రయించారని సెటైర్లు పేల్చారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. పాడైపోయిన రోడ్లపే ప్రయాణించే ధైర్యం లేక ఆయన హెలికాప్టర్‌ లో వెళ్లారా? అని ప్రశ్నించారు. 28 కిలోమీటర్లు కూడా సీఎం రోడ్డు ప్రయాణం చేయలేరా అని అన్నారు. జనం నవ్వుకుంటున్నారని, జనం సొమ్ము సీఎం హెలికాప్టర్ల పర్యటనల పాలవుతోందని అన్నారు. హెలికాప్టర్‌ కు పెట్టే డబ్బులతో రోడ్లు బాగవుతాయని చురకలంటించారు. ప్రజల్ని గతుకు రోడ్ల పాల్జేసి.. జగన్‌ హెలికాప్టర్‌ లో తిరుగుతున్నారని అన్నారు నాదెండ్ల.

జగన్ హెలికాప్టర్ పర్యటనపై జనసేన తరపున ఓ కార్టూన్ కూడా వేశారు. 20 అయినా, 20వేల కిలోమీటర్లయినా సారు నేలమీద పొయ్యేదేలే, తగ్గేదేలే.. అంటూ కార్టూన్ తో సెటైర్లు పేల్చారు. సీఎం జగన్ వస్తే ప్రతిపక్ష నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, ఇలా అరెస్ట్ లు చేయాలని ఏ చట్టం చెబుతోందని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం తెనాలి పర్యటన కోసం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారన్నారు.


వైసీపీ కౌంటర్లు..

జగన్ హెలికాప్టర్లో వెళ్లడంపై సెటైర్లు వేస్తున్న జనసేన నేతలు, వారి అధినేత చార్టర్ ఫ్లైట్ లో వెళ్లడాన్ని ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్నించారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్తే తప్పేంటని అంటున్నారు. సంపాదించిన సొమ్మంతా ప్రజలకోసం ధారపోస్తున్నానని చెప్పే పవన్ ప్రత్యేక ఫ్లైట్ లలో తిరిగే ఖర్చు ఎవరిదని ప్రశ్నించారు. అదంతా ప్యాకేజీ సొమ్ము కాదా అని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తమ్మీద ముఖ్యమంత్రి పర్యటనకు ఏ వాహనం వాడాలి, దేన్ని వాడకూడదు అంటూ సలహాలిచ్చి, చివరకు వ్యవహారం పవన్ పై రివర్స్ అయ్యేలా చేసుకున్నారు జనసైనికులు.

First Published:  28 Feb 2023 1:06 PM GMT
Next Story