Telugu Global
Andhra Pradesh

కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.

కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
X

టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఉదయ్ శ్రీనివాస్ జనసేన పిఠాపురం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు టికెట్ దక్కుతుందని కొన్ని నెలలుగా ఆయన పిఠాపురంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించడంతో పోటీ నుంచి ఉదయ్ శ్రీనివాస్ తప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.

తాను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుంటే ఉదయ్ శ్రీనివాస్ త్యాగం చేశారని.. అందువల్ల ఆయనకు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తనను ఎంపీగా పోటీ చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షా కోరితే ఆలోచిస్తానని చెప్పారు. అప్పుడు పిఠాపురం నుంచి ఉదయ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, తాను కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

First Published:  19 March 2024 6:00 PM GMT
Next Story