Telugu Global
Andhra Pradesh

జనానికి దూరమవుతున్న జనసేన

జనాన్ని ఉత్సాహపరచడానికైనా కాపు హీరోలు వంగవీటి రంగా, మిరియాల వెంకట్రావుల పేర్లు పవన్‌ ప్రస్తావించలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టుగా, చంద్రబాబు రక్షకుడనీ, అభివృద్ధికి మారుపేరనీ తెగ పొగిడారు.

జనానికి దూరమవుతున్న జనసేన
X

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించు, గర్జించు, సమర్పించు రాజకీయ చిత్రం విడుదలకి ముందే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందా..? అయినట్టే ఉంది. దానికి కొన్ని కారణాలు – కొన్ని ఉదాహరణలు చూద్దాం..

కారణం ఒకటి – పవన్‌ కళ్యాణ్‌..!

తాడేపల్లిగూడెం ‘జెండా’సభలో పవన్‌ నోటికొచ్చినట్టు మాట్లాడారు. నన్ను రెండుసార్లు ఓడించారు. రెండు చోట్లా ఓడించారు అంటూ తనని నమ్మిన కాపుల్ని తిట్టిపోశారు. తెలుగుదేశంతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అలా మాట్లాడకూడదనే ఇంగితం కూడా పవన్‌కి లేదు. ఏ నాయకుడూ కార్యకర్తల్ని తిట్టకూడదు, నిందించకూడదు. అది గోల్డెన్‌ రూల్‌..! తిట్టి, వాళ్లనే ఎలా ఓట్లు అడుగుతావ్‌..?

కారణం రెండు – పవన్‌ కళ్యాణ్‌!

జనాన్ని ఉత్సాహపరచడానికైనా కాపు హీరోలు వంగవీటి రంగా, మిరియాల వెంకట్రావుల పేర్లు పవన్‌ ప్రస్తావించలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టుగా, చంద్రబాబు రక్షకుడనీ, అభివృద్ధికి మారుపేరనీ తెగ పొగిడారు. అంతేనా, ఆనాడు తిరుపతిలోని అలిపిరిలో క్లేమోర్‌ మైన్స్‌ పేలి, కారు 16 అడుగుల ఎత్తుకి ఎగిరిపడినా చొక్కా దులుపుకుంటూ సజీవుడై తిరిగి వచ్చిన మొనగాడు చంద్రబాబు అంటూ చెక్క భజన చేశారు పవన్‌. ఎందుకింత దిగజారుడు..? ఎంత పుచ్చుకుంటే మాత్రం ఇంత విచ్చలవిడిగా పొగడాలా..? ఇది కాపుల్ని దారుణంగా హర్ట్‌ చేయడం కాదా..?

కారణం మూడు – ముద్రగడ పద్మనాభం..

రగిలి రగిలి ఉన్న కాపు నాయకుడు ముద్రగడ, ఆగి, ఆగి.. చివరికి పవన్‌కో లేఖ రాశారు. ‘‘నువ్వు వాళ్లని కనీసం 80 సీట్లు అడగాల్సింది. పవర్‌ షేరింగ్‌లో భాగంగా రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేయాల్సింది. నీకు ఆ సాహసం లేదు. నా దగ్గరికి వస్తానని చెప్పి నువ్వురాలేదు. ప్రతి దానికీ నీకెవరో పర్మిషన్లు ఇవ్వాలి. ఈ సభకి కూడా నాకు ఆహ్వానం లేదు. నా అవసరం మీకు రాదనే అనుకుంటున్నాను’’ అని ముద్రగడ స్పష్టంగా, సూటిగా దిమ్మతిరిగేట్టు లెటర్‌ రాశారు. దీనికి పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పగలరా..?

కారణం నాలుగు – అసంతృప్తి జ్వాలా తోరణం!

చంద్రబాబు ఎడమ చేత్తో విసిరిపడేసిన 24 సీట్లనీ తలవొంచుకుని, చేతులు కట్టుకుని తీసుకున్న పవన్, ప్రజలకి ఏం చెబుతారు..? మిగిలిన 151 నియోజకవర్గాల్లో కాపులూ, కాపు నాయకులూ లేరా..? పోనీ, కనీసం యాభై చోట్లన్నా పోటీ చేయగల సత్తా ఉన్న బీసీలూ, కాపులూ, మైనార్టీలూ, పవన్‌ వీరాభిమానులూ ఉంటారుగా, వాళ్లకేమని చెబుతారు..? పొత్తు కోసం త్యాగాలు చేయాల్సిందే అంటే వాళ్లు వింటారా..? ‘త్యాగం’ చెయ్యడం అంటే కమ్మవాళ్లకీ, లేదా చంద్రబాబు విధేయులకీ నోర్మూసుకొని ఓట్లేయండి అని చెప్పడమేగా..! ఇది చిల్లర రాజకీయం. రాజకీయాలంటే ఎత్తుగడలూ, వ్యూహం ఉంటాయి. తిరుగులేని కాపుశక్తిని, కమ్మయుక్తికి అమ్మేయడం రాజకీయం ఎలా అవుతుంది.! మామకి వెన్నుపోటు పొడిచిన స్పెషలిస్టు చంద్రబాబు నుంచి అదే నేర్చుకున్నావా పవన్‌..? నమ్ముకున్న కాపులకి వెన్నుపోటు పొడిచి ఏం సాధించాలనుకుంటున్నావ్‌..?

కారణం ఐదు – మండలి, హరిరామజోగయ్య..!

చేగొండి హరిరామ జోగయ్య హెచ్చరిస్తూనే ఉన్నాడు. చవగ్గా పాతికసీట్లకే పార్టీనీ, ప్రయోజనాలనూ పణం పెట్టొద్దని గట్టిగానే చెప్పాడు. పవన్‌ వినలేదు. పోనీ ముద్రగడతో మాట్లాడాడా..? అంటే అదీ లేదు. ఇప్పుడు మండలి బుద్ధాప్రసాద్‌ వంతు. మాజీ మంత్రి, సౌమ్యుడూ, పరువూ ప్రతిష్టా ఉన్న నాయకుడు మండలి బుద్ధా ప్రసాద్, జగన్మోహన్‌రెడ్డి వైపు చూస్తున్నారు. వైసీపీలో చేరుదాం అనే ఆలోచనలో ఉన్నారు.! సొంత నాయకుల్ని, సొంత కార్యకర్తల్ని ఒకేసారి దూరం చేసుకోగల అరుదైన టాలెంట్‌ పవన్‌ కళ్యాణ్‌ది..! ఎంత దయనీయం..!

పిఠాపురం కదులుతోంది, రా.. కదలిరా..!

First Published:  29 Feb 2024 6:41 AM GMT
Next Story