Telugu Global
Andhra Pradesh

నన్ను గెలిపించినందుకు సారీ- జనసేన ఎంపీటీసీ ప్రజా క్షమాపణ సభ

ఊరికి ఏదో ఒకటి చేయాలనే తాను ఎంపీటీసీగా పోటీ చేశానని.. ప్రజలు కూడా నమ్మి ఓట్లేసి గెలిపించారని.. కానీ తానే ఆ నమ్మకాన్ని నిలుపుకోలేకపోయానని చెప్పారు.

నన్ను గెలిపించినందుకు సారీ- జనసేన ఎంపీటీసీ ప్రజా క్షమాపణ సభ
X

మారుతున్న రాజకీయ విధానాల కారణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సంతృప్తి సాధించలేకపోతున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు నిధులు అందించే కార్యక్రమం ఏపీలో అమలవుతుండటంతో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రమేయం, పని పెద్దగా ఉండటం లేదు. దీంతో పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిలో అధికార పార్టీ, ప్రతిపక్షం అన్న తేడా లేదు.

ఇలాంటి అసంతృప్తితోనే ఉన్న జనసేన ఎంపీటీసీ ఒకరు ఏకంగా ప్రజా క్షమాపణ సభ పెట్టేశారు. ''మీరేమో భారీగా ఓట్లేసి గెలిపించారు.. నేను మాత్రం ఏమీ చేయలేకపోయాను క్షమించండి'' అంటూ స్థానిక ఓటర్లను సభకు ఆహ్వానించి విజ్ఞప్తి చేశాడు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామ ఎంపీటీసీ వాకా శ్రీను ఈ సభ ఏర్పాటు చేశారు. ఊరికి ఏదో ఒకటి చేయాలనే తాను ఎంపీటీసీగా పోటీ చేశానని.. ప్రజలు కూడా నమ్మి ఓట్లేసి గెలిపించారని.. కానీ తానే ఆ నమ్మకాన్ని నిలుపుకోలేకపోయానని చెప్పారు. గెలిచి 16 నెలలు అవుతున్నా తనకు ఒక్క రూపాయి నిధులు కూడా ప్రభుత్వం కేటాయించలేదన్నారు. ఈ కారణంగానే తాను ఒక్క పని కూడా చేయలేకపోయానని అర్థం చేసుకుని క్షమించాలని కోరారు. తాను జనసేన నుంచి గెలవడం కారణంగానే తన పరిధిలోని ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు.

Next Story