Telugu Global
Andhra Pradesh

మంత్రులను బకరాలను చేసిన 'వారాహి'

మంత్రులు, మాజీ మంత్రులను కెలికేందుకే పవన్ లేదా జనసేన నేతలు ఒక ఎర వేశారు. వీళ్ళు కూడా ముందు వెనకా చూసుకోకుండా గుడ్డెద్దుల్లాగ వారాహి మీద నోరు పారేసుకున్నారు.

మంత్రులను బకరాలను చేసిన వారాహి
X

ఇంకా ఏపీ రోడ్లపైకి రాకముందే వారాహి వెహికల్ మంత్రులు, సీనియర్ నేతలను బకరాలను చేసేసింది. వారాహి అనేది ఎప్పుడు మొదలవుతుందో తెలియ‌ని యాత్రల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వాహనానికి పెట్టుకున్న పేరు. వారాహి వెహికల్ పరిచయాన్ని పవన్ సినిమా టీజర్ విడుదల రేంజ్‌లో ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. దాంతో మాజీమంత్రి పేర్నినాని గోల మొదలుపెట్టారు. వాహనానికి మిలిటరీ గ్రీన్ రంగు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

నిజానికి వాహనం రిజిస్ట్రేషన్ జరిగేది తెలంగాణ‌లో. ఏదన్నా అభ్యంతరాలుంటే తెలంగాణ రవాణా శాఖ చూసుకుంటుంది. మధ్యలో పేర్నినాని అభ్యంతరం ఏమిటి? ఒకవేళ రవాణా శాఖ ఉన్నతాధికారులు రిజిస్ట్రేషన్ చేయటానికి అభ్యంతరాలు చెబితే అప్పుడు స్పందించినా బాగుండేది. పేర్నినాని అభ్యంతరాలు చెప్పగానే మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్‌ వెంటనే అందుకుని పవన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.

తీరా చూస్తే ఏమైంది? వారాహికి రవాణా శాఖ రిజిస్ట్రేషన్ చేసేసింది. కావాలని మంత్రులు, మాజీ మంత్రులను కెలికేందుకే పవన్ లేదా జనసేన నేతలు ఒక ఎర వేశారు. వీళ్ళు కూడా ముందు వెనకా చూసుకోకుండా గుడ్డెద్దుల్లాగ వారాహి మీద నోరు పారేసుకున్నారు. నాలుగు రోజులు నానా రచ్చ జరిగిన తర్వాత చివరకు జనసేన వెహికల్ రిజిస్ట్రేషన్ తాలూకు కాగితాలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. దాంతో ఏమి చేయాలో తెలీక మంత్రులు నోళ్ళు మూసుకున్నారు.

ఇక్కడ అర్థమైందేమంటే కావాలనే వారాహిని ఎరగా వేసి మంత్రులను జనసేన బకరాలను చేసిందని. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు కనుక్కోవాలంటే తెలంగాణ రవాణా శాఖ అధికారులను అడిగి ఉంటే చెప్పుండేవారే. కానీ మంత్రులు చేతులకు పని చెప్పకుండా నోటికి పని చెప్పారు. ఇక్కడే జనాల ముందు అబాసుపాలయ్యారు. పైగా మంత్రులు, మాజీ మంత్రుల్లో కొందరు ఇంకేమీ పనిలేనట్లుగా 24 గంటలూ పవన్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థంకావటం లేదు. చూడబోతే మంత్రులే పవన్‌కు బాగా ప్రచారం చేస్తున్నట్లుంది.

Next Story