Telugu Global
Andhra Pradesh

బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు జనసేన ఆర్థిక సహాయం

మత్స్యకారులకు అండగా ఉంటామని తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వచ్చే రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా విశాఖకు వచ్చి బాధిత కుటుంబాలకు సహాయం అందజేస్తానని ప్రకటించారు.

బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు జనసేన ఆర్థిక సహాయం
X

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. కాగా, ప్రమాదంలో బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నష్టపోయిన బోటు యజమానులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు ఆయన ప్రకటించారు.

హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కాగా.. ఒక్కో బోటు విలువ సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుంది. సుమారు 500 పడవలు లంగరు వేసి ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం జరగగా.. 100 బోట్లు మంటల్లో చిక్కుకున్నాయి. వీటిలో 40 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో 60 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

అయితే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది బోట్లను దగ్ధం చేశారని.. మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, అగ్ని ప్రమాదంలో బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఒక్కో బోటు విలువను లెక్కగట్టి అందులో 80 శాతం మేర నష్టపరిహారాన్ని మత్స్యకారులకు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.


ఇదిలా ఉంటే.. మత్స్యకారులకు అండగా ఉంటామని తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగి 60కి పైగా బోట్లను నష్టపోయిన యజమానులకు, వారి కుటుంబాలకు జనసేన తరఫున రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా విశాఖకు వచ్చి బాధిత కుటుంబాలకు సహాయం అందజేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

First Published:  21 Nov 2023 10:14 AM GMT
Next Story