Telugu Global
Andhra Pradesh

తోటను ఎందుకు టచ్ చేయటం లేదు?

జనసేనపై తోట విరుచుకుపడుతున్నా పార్టీ తరపున కానీ సోషల్ మీడియా వింగ్ తరపున కానీ ఎవరూ నోరెత్తటం లేదు. ప్రత్యర్ధుల విషయంలో సంయమనం పాటిస్తున్నామని చెప్పుకునేందుకునే ఇంత మౌనం వహిస్తున్నది? జనసేనలో అంత సీన్ ఎవరికీ లేదని అందరికీ తెలుసు.

తోటను ఎందుకు టచ్ చేయటం లేదు?
X

మామూలుగా అయితే ఈపాటికే బీఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్‌ను సోషల్ మీడియాలో గుక్కతిప్పుకోనీయకుండా వాయించేస్తుండాలి. కానీ ఒక్కటంటే ఒక్క కామెంటు కూడా తోటకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, పోస్టు చేయలేదు. పైగా జనసేనపై తోట విరుచుకుపడుతున్నా పార్టీ తరపున కానీ సోషల్ మీడియా వింగ్ తరపున కానీ ఎవరూ నోరెత్తటం లేదు. ప్రత్యర్ధుల విషయంలో సంయమనం పాటిస్తున్నామని చెప్పుకునేందుకునే ఇంత మౌనం వహిస్తున్నది? జనసేనలో అంత సీన్ ఎవరికీ లేదని అందరికీ తెలుసు.

మరి ఇంకెందుకని తోటను ఎవరు ఏమీ అనటంలేదు? అందరికీ ఇదే అనుమానం మొదలైంది. ఆరాతీస్తే అధినేత పవన్ కల్యాణ్ నుండి వచ్చిన ఆదేశాలే కారణమని సమాచారం. బీఆర్ఎస్‌లో చేరే సమయానికి తోట జనసేన ప్రధాన కార్యదర్శిగానే ఉన్నారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు. సన్నిహితుడే కాకుండా పార్టీకి మెయిన్‌ ఫైనాన్షియర్ కమ్ టీవీ ఛానల్ ఓనర్ కూడా.

జనసేన వ్యవహారం ఎలాగుంటుందంటే పవన్ అంటే పడని ప్రత్యర్ధులను లేదా జనసేనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపైన మీడియాతో పాటు సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తుంటారు. ప్రత్యర్ధులకు గుక్కతిప్పుకోనీయకుండా పదేపదే దాడులు చేస్తుంటారు. పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకునేవాళ్ళు లక్షల్లో ఉండటంతో ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూట్ చానళ్ళ ద్వారా రోజుల తరబడి దాడులు చేస్తుంటారు. వీళ్ళ దాడులను తట్టుకోలేక చాలామంది పోలీసులకు ఫిర్యాదులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

అలాంటిది జనసేన మ్యానిఫెస్టో ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నతోటపై పార్టీ తరపున ఒక్కళ్ళు కూడా మాట్లాడటం లేదు. కారణం ఏమిటంటే ఇక్కడ తోటను ఏమన్నా అంటే హైదరాబాద్‌లో పవన్‌కు ఎక్కడ ఇబ్బందులు మొదలవుతాయో అనే భయంతోనే వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనతోనే పవన్ కూడా తోట జోలికి ఎవరు వెళ్ళద్దని ఆదేశించినట్లు సమాచారం. మొత్తానికి జనసేనను కంట్రోల్ చేయటంలో తోట విజయం సాధించినట్లే అనిపిస్తోంది. ముందుముందు ఇంకేం జరుగుతుందో చూడాలి.

First Published:  10 Jan 2023 5:45 AM GMT
Next Story