Telugu Global
Andhra Pradesh

అంగన్‌వాడీలపై ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం.. - జనసేన

ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని అందించడానికి వెళ్తున్న అంగన్‌వాడీలను పోలీసులు ఈడ్చివేయడం, వాహనాల్లో ఎక్కించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.

అంగన్‌వాడీలపై ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికం.. - జనసేన
X

తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశారు.

42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు. నామమాత్ర వేతనాలతో పనిచేస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా.. విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం పాలకుల ధోరణిని తెలియజేస్తోందని చెప్పారు.

ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని అందించడానికి వెళ్తున్న అంగన్‌వాడీలను పోలీసులు ఈడ్చివేయడం, వాహనాల్లో ఎక్కించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలను అరెస్టు చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు.

సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తూ పొరుగు రాష్ట్రాల కంటే రూ. 1000 జీతం ఎక్కువగా ఇస్తానని హామీ ఇచ్చారని, ఈ హామీని గుర్తు చేసి అమలుపరచాలని అంగన్‌వాడీ సిబ్బంది కోరుతుంటే వారి పట్ల ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరించడం తగదన్నారు. అంగన్‌వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ విధానాన్ని వర్తింప చేయాలని, చిన్నపాటి జీతాలతో పనిచేస్తున్న వారి పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

First Published:  22 Jan 2024 11:53 AM GMT
Next Story