Telugu Global
Andhra Pradesh

విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్నా - మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఓటును డబ్బిచ్చి కొనడాన్ని కొందరు వ్యాపారంగా భావిస్తున్నారని అన్నారు. కాబట్టి ప్రజలు ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఉండే పార్టీకి ఓటు వేయాలని సూచించారు.

విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్నా - మాజీ జేడీ లక్ష్మీనారాయణ
X

వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ ప్రకటించారు. తాజాగా ఆయన విశాఖలో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో తాను జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని, ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయం మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

ఫ్రంట్ తరఫున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు శివ భాగ్య రావు బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల స్థానిక పరిపాలన గాడిత‌ప్పి పోయిందని లక్ష్మీనారాయణ విమర్శించారు. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవడం లేదని మండిపడ్డారు.

ఓటును డబ్బిచ్చి కొనడాన్ని కొందరు వ్యాపారంగా భావిస్తున్నారని అన్నారు. కాబట్టి ప్రజలు ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఉండే పార్టీకి ఓటు వేయాలని సూచించారు. అవినీతి రహిత ప్రభుత్వం, నిరుద్యోగ రహిత ప్రభుత్వం కావాలంటే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలను గెలిపించాలని లక్ష్మీనారాయణ ప్రజలను కోరారు.

First Published:  15 March 2024 9:04 AM GMT
Next Story