Telugu Global
Andhra Pradesh

సీపీఎస్ పై జగన్ సర్కారు వెనక్కి తగ్గినట్టేనా..?

సీపీఎస్ రద్దు విషయంలో పట్టుదలతో ఉన్న ఏపీ ప్రభుత్వం కాస్త మెత్తబడినట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగులతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

సీపీఎస్ పై జగన్ సర్కారు వెనక్కి తగ్గినట్టేనా..?
X

సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు, అది మాత్రం కుదరదు కావాలంటే జీపీఎస్ లో మార్పులు చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం.. పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్, ఇప్పుడు దాన్ని ఎందుకు నెరవేర్చరంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ రద్దుతో ఇన్ని తలనొప్పులుంటాయని తెలియదు, రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు తెచ్చే పని చేయలేమంటూ ప్రభుత్వం వివరణ ఇస్తోంది. ఈ క్రమంలో మంత్రి బొత్స మరోసారి సీపీఎస్ పై స్పందించారు. రెండు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ ఒక్క హామీ ఇదే..

ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు, నిబంధనలు, సూచనల మేరకు ఈ ఏడాది చివరికల్లా పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి బొత్స. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 95 శాతం హామీలను నెరవేర్చిందని మిగిలిన 5 శాతం హామీలలో సీపీఎస్ ఉందని అన్న ఆయన.. ఈ హామీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపామని, జీపీఎస్ ద్వారా చేకూరే ప్రయోజనాలనూ వివరించామని చెప్పారు. అయితే ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారని, దీనిపై రెండు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

మెత్తబడినట్టేనా..?

సీపీఎస్ రద్దు అసాధ్యం అంటూ ఇన్నాళ్లూ చెబుతూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఉద్యోగులు మాట వినకపోతే జీపీఎస్ పై జీవో విడుదల చేస్తామని, అదే తమ ఆఖరి నిర్ణయమని కూడా చెప్పారు మంత్రులు. అయితే ఉద్యోగులు కూడా ఇది తమ జీవన్మరణ పోరాటమని అంటున్నారు. కానీ ప్రభుత్వంతో ఘర్షణ పడటం తమ ఉద్దేశం కాదని చెబుతున్నారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఆందోళన వాయిదా వేసుకోవడంతో, ప్రభుత్వం కూడా ఓ మెట్టు దిగి వచ్చినట్టు కనపడుతోంది. రెండు నెలల గడువు పెట్టి సీపీఎస్ పై మరోసారి ఆలోచించే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానానికి జగన్ సిద్ధపడితే.. ఉద్యోగ వర్గాల్లో వైసీపీపై మరింత అభిమానం పెరగడం ఖాయం.

First Published:  10 Sep 2022 11:41 AM GMT
Next Story