Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి ఎదురు దెబ్బలు.. పండగ చేసుకుంటున్న వైసీపీ

అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. స్థానికేతరులకు ఇక్కడ స్థలాలు కేటాయించొద్దంటూ రైతులు వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. దీంతో అమరావతిలో జగనన్న కాలనీలు వచ్చేస్తున్నాయి.

చంద్రబాబుకి ఎదురు దెబ్బలు.. పండగ చేసుకుంటున్న వైసీపీ
X

'సిట్' దర్యాప్తుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు, తాజాగా అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వరకు.. చంద్రబాబుకి అన్నీ ఎదురుదెబ్బలే అనుకోవాలి. ఇదే సమయంలో వైసీపీ మాత్రం పండగ చేసుకుంటోంది. చంద్రబాబు పాలనపై 'సిట్' దర్యాప్తుకి సుప్రీం అంగీకరించడంతో ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మాటలదాడి చేశారు. బాబు, లోకేష్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. రెండ్రోజుల గ్యాప్ లోనే ఏపీ హైకోర్టు, అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. స్థానికేతరులకు ఇక్కడ స్థలాలు కేటాయించొద్దంటూ రైతులు వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. దీంతో వైసీపీ అనుకున్నట్టుగానే అమరావతిలో జగనన్న కాలనీలు వచ్చేస్తున్నాయి.

హైకోర్టు తీర్పుతో సీఆర్డీఏ పరిధిలో దాదాపు 50 వేల మందికి ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ ఊపందుకోబోతోంది. అమరావతికోసం భూములిచ్చినవారికే అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీన్ మారింది. అమరావతి అందరిదీ అంటూ చుట్టుపక్కల ప్రాంతాల పేదలకు కూడా ఇక్కడ భూములు కేటాయించారు. ప్రత్యేకంగా ఆర్‌–5 జోన్‌ ఏర్పాటు చేసి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 48,218 మందికి స్థలాలు కేటాయించారు. దీనిపై స్థానిక రైతులు కోర్టుకెక్కారు. భూములు కోల్పోయిన తమని పక్కనపెట్టి, స్థానికేతరులకు ఇక్కడ పట్టాలివ్వడం కుదరదన్నారు. కానీ కోర్టు ససేమిరా అని తేల్చేసింది. దీంతో జగన్ పంతం నెగ్గినట్టయింది. అదే సమయంలో చంద్రబాబు పేదలకు భూములివ్వకుండా అడ్డుపడ్డారని, కానీ జగన్ పైచేయి సాధించారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీలో పండగ వాతావరణం నెలకొంది. లబ్ధిదారులతో కలసి నేతలు కేక్ కట్ చేసి పండగ చేసుకుంటున్నారు.



ఈనెల 15న పెద్ద పండగ..

హైకోర్టు తీర్పుతో సీఆర్డీఏ పరిధిలో మొత్తం 21 లే అవుట్లలో జగనన్న కాలనీల ఏర్పాటుకి మార్గం సుగమం అయింది. అమరావతిలో జగనన్న కాలనీ బోర్డ్ లు పడబోతున్నాయి. ఈనెల 15న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తమ్మీద అమరావతి విషయంలో జగన్ అనుకున్నది సాధించినట్టయింది.

First Published:  6 May 2023 1:06 AM GMT
Next Story