Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేలు డిసైడ్ అయిపోయారా?

మార్చి 18 నుండి మొదలవ్వబోతున్న ‘మా భవిష్యత్తు నువ్వే జగనన్న’ అనే కార్యక్రమంలో పాల్గొనాలని, లేకపోతే టికెట్లు ఇచ్చేది లేదని జగన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. వర్క్ షాపులో మంత్రులతో కలిపి సుమారు 30 మంది ఎమ్మెల్యేలపై బాగా సిరియస్ అయ్యారు.

ఎమ్మెల్యేలు డిసైడ్ అయిపోయారా?
X

మొదటి సమావేశంలో స్పష్టంగా చెప్పారు. రెండో వర్క్ షాపులో హెచ్చరించారు. మూడో సమావేశంలో సీరియస్ అయ్యారు. నాలుగో సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్చి 18 నుండి మొదలవ్వబోతున్న ‘మా భవిష్యత్తు నువ్వే జగనన్న’ అనే కార్యక్రమంలో పాల్గొనాలని, లేకపోతే టికెట్లు ఇచ్చేది లేదని ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. వర్క్ షాపులో మంత్రులతో కలిపి సుమారు 30 మంది ఎమ్మెల్యేలపై జగన్ బాగా సిరియస్ అయ్యారు.

ప్రతి వర్క్ షాపులోను జగన్ సీరియస్ అవుతున్నా కొంతమంది ఏమాత్రం పట్టించుకోవటంలేదు. నాలుగు వర్క్ షాపుల్లో ఇచ్చిన వార్నింగులనే పట్టించుకోని ఎమ్మెల్యేలు మార్చిలో జరగబోయే కార్యక్రమంలో పాల్గొంటారా? పైగా గడపగడపకు మ‌న కార్యక్రమంలో పాల్గొన్నవాళ్ళకే టికెట్లిస్తానని లింకుపెట్టినా 30 మంది ఎమ్మెల్యేలు పట్టించుకోలేదంటే ఏమిట‌ర్థం? అర్థం ఏమిటంటే రెండే కారణాలు కనబడుతున్నాయి.

అవేమిటంటే కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా టికెట్ ఎక్కడికి పోదన్న నమ్మకం. ఇక రెండోది ఏమిటంటే ఎంత కష్టపడినా తమకు ఎలాగూ టికెట్ వచ్చేదిలేదన్న అనుమానం. రెండో కారణానికే అవకాశం ఎక్కువుంది. అందుకనే జగన్ ఎంత సిరియస్‌గా చెబుతున్నా వీళ్ళు పట్టించుకోవటంలేదు. తమ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందని, మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమని బహుశా వీళ్ళకి అనిపిచిందేమో. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నట్లున్నారు. అందుకనే జగన్ వార్నింగులను కూడా లెక్కచేయటంలేదు.

జగన్ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రత్యామ్నాయంగా టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయన్న ధైర్యం ఎక్కువైనట్లుంది. అధికారాలను చెలాయించటానికి మాత్రమే అలవాటుపడిన మంత్రులు, ఎమ్మెల్యేలను జనాల్లోకి వెళ్ళి తిరగమంటే కష్టపడమంటే చాలా కష్టంగా ఉన్నట్లుంది. కాకపోతే విచిత్రం ఏమిటంటే జగన్‌కు అత్యంత సన్నిహితులైన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజాతో పాటు మాజీ మంత్రులు, కొడాలి నాని, సుచరిత, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, సామినేని ఉదయభాను వంటివాళ్ళు ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.

First Published:  14 Feb 2023 6:35 AM GMT
Next Story