Telugu Global
Andhra Pradesh

ఇది అసమర్థ ప్రభుత్వం.. జగన్ ఘాటు ట్వీట్

ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటు వల్ల అంటూ చంద్రబాబు PPPP మోడల్‌ నడుపుతున్నారని మండిపడ్డారు జగన్.

YS Jagan Mohan Reddy
X

తమ హయాంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కనీసం ప్రారంభించడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. ఈ ఏడాది కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉందని, ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని, ఆ పలుకుబడిని వాడుకుని ఐదు కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని ట్విట్టర్ ద్వారా కోరారు జగన్.


రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోందని విమర్శించారు జగన్. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తున్నారని, స్పెషలిస్టు వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియామకాల్ని ఆపేసి జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని మండిపడ్డారు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తున్నారని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి, ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి.. ప్రజలు తమ ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు మళ్లీ ఏపీలో కనపడుతున్నాయని చెప్పారు జగన్.

వైసీపీ హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం విలేజ్-వార్డు క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు జగన్. మండలానికి 2 పీహెచ్‌సీలు ఏర్పాటు చేశామన్నారు. 108, 104 సర్వీసుల్ని పెంచి, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 చికిత్సలని తీసుకొచ్చామన్నారు. ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టామన్నారు. ఆస్పత్రుల్లో నాడు-నేడు, కొత్త మెడికల్‌ కాలేజీల కోసం రూ.16,880 కోట్లు కేటాయించామని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున 17 కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని, రూ.8,480 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టామన్నారు. తమ హయాంలో ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని, కొత్తగా 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు జగన్. 2024-25 విద్యా సంవత్సరంలో మరో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా, చంద్రబాబు వైఫల్యం వల్ల అది సాధ్యం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా అనుమతులు తెచ్చుకోలేకపోవడం ముమ్మాటికీ వారి వైఫల్యమేనని విమర్శించారు జగన్.

ఇక చంద్రబాబు హయాంలో అన్నీ ప్రైవేటు పరం చేసి, సామాన్యులపై భారం మోపుతున్నారని అన్నారు జగన్. ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటు వల్ల అంటూ PPPP మోడల్‌ నడుపుతున్నారని మండిపడ్డారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకోవాలని, మిగతా కాలేజీలకు వచ్చే ఏడాది అనుమతులు సాధించాలని, ఆదిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు జగన్.

First Published:  27 Aug 2024 3:48 PM GMT
Next Story