Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షాలపై తిరుగులేని అస్త్రం?

బీసీలకు ఇవ్వబోయే ప్రాధాన్యతే ఇతర పార్టీలపైకి తిరుగులేని అస్త్రం అవుతుందని జగన్ భావిస్తున్నారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి ఏమవుతుందో చూడాల్సిందే.

ప్రతిపక్షాలపై తిరుగులేని అస్త్రం?
X

రాబోయే ఎన్నికల్లో గెలుపు టార్గెట్‌గా జగన్మోహన్ రెడ్డి కీలకమైన అస్త్రాన్ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. అదేమిటంటే బీసీ అస్త్రం. అంటే ఇప్పటికే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వివిధ కార్పొరేషన్లు, డైరెక్టర్ల నియామకాలు, ఎలెక్టెడ్ పోస్టులు అన్నింటిలోనూ బీసీలకే అగ్రస్థానం ఇచ్చారు. మొత్తంమీద 4,776 పోస్టులను భర్తీచేస్తే అందులో 3,159 పోస్టులను బీసీలకే కేటాయించారు. ఇన్నివేల పోస్టులను బీసీలకు గతంలో ఏ ముఖ్యమంత్రి కేటాయించలేదు.

చరిత్రను పక్కనపెట్టేస్తే భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో బీసీలకు మరిన్ని టికెట్లు కేటాయించాలని. మామూలుగా అయితే బీసీ రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో మాత్రమే వర్తిస్తుంది. అయితే రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా మామూలుగా ఇస్తున్న టికెట్లు కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీలకు అదనంగా టికెట్లను ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దీనివల్ల పార్టీకి ఇంకా దూరంగా ఉన్న బీసీ వర్గాలను దగ్గరకు చేర్చుకోవచ్చన్నది జగన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మొన్నటి ఎన్నికలనే తీసుకుంటే రాజమండ్రి, అనంతపురం, హిందుపురం, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా బీసీలకే టికెట్లిచ్చారు. వీటిల్లో కర్నూలు, అనంతపురంలో ఎక్కువగా రెడ్లే పోటీ చేస్తున్నారు. ఇక రాజమండ్రిలో అయితే మొదటిసారి ఒక బీసీ అభ్యర్థిని వైసీపీనే రంగంలోకి దింపారు. హిందుపురంలో బీసీలు లేదా ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అంటే బీసీ జనాభా ఎక్కువగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులనే పోటీలోకి దింపి జగన్ సక్సెస్ సాధించారు.

ఇదే ఫార్ములాను రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలుచేయబోతున్నారట. దీనికి ప్రాతిపదిక ఏమిటంటే మున్సిపల్ ఛైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో సాధించిన విజయమే. జనరల్ స్థానాల్లో కూడా ఛైర్మన్, మేయర్ అభ్యర్థులుగా ముందే బీసీలను ప్రకటించటంతో బీసీల్లోని అత్యధిక ఓట్లు వైసీపీకి పడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే టికెట్లలో కూడా బీసీలకే ఎక్కువ కేటాయించాలని అనుకుంటున్నారట. బీసీలకు ఇవ్వబోయే ప్రాధాన్యతే ఇతర పార్టీలపైకి తిరుగులేని అస్త్రం అవుతుందని జగన్ భావిస్తున్నారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి ఏమవుతుందో చూడాల్సిందే.


First Published:  24 Sep 2023 5:09 AM GMT
Next Story