Telugu Global
Andhra Pradesh

ఏపీ రోడ్లపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. ఫిర్యాదుల కోసం త్వరలో యాప్

పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఈ యాప్ రూపకల్పన జరుగుతున్నా.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా చూడలని సీఎం ఆదేశించారు.

ఏపీ రోడ్లపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. ఫిర్యాదుల కోసం త్వరలో యాప్
X

ఏపీలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో నిత్యం ప్రయాణాలు చేసే వారికి తెలిసిన విషయమే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ విమర్శలు రోడ్ల పరిస్థితిపైనే వచ్చాయి. జనసేన అయితే రోడ్లు అధ్యాన్నంగా మారడంపై కొన్ని రోజులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపించింది. నేషనల్ హైవేలను పక్కన పెడితే రాష్ట్ర రహదారులు.. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. నిధుల కొరతతో చాన్నాళ్లు ప్రభుత్వం కూడా రోడ్లపై దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు రోడ్లపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

రోడ్లు, భవనాల శాఖతో పాటు పంచాయతి రాజ్ శాఖ ఇటీవల రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టింది. వర్షాకాలం ముగియడంతో గుంతలు పడిన రోడ్లను తాత్కాలికంగా పూడ్చి కొంత మేర అనువుగా తీర్చి దిద్దుతోంది. ఇక పూర్తిగా పాడైపోయిన రోడ్లను కొత్తగా నిర్మిస్తున్నది. ఇకపై రాష్ట్రంలో ఏ రోడ్డులో అయినా గుంతలు పడితే నేరుగా అధికారులకు తెలియజేయడానికి ఒక యాప్ సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శాఖపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి, ఇబ్బందులను తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ను నెల రోజుల్లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం రోడ్లకు సంబంధించే కాకుండా పచ్చదనం, సుదరీకరణ, వీధిలైట్లు, ఫుట్‌పాత్స్, మురుగు కాల్వల పరిస్థితి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అంశాలను కూడా సమీక్షించేందుకు యాప్‌లో చోటు కల్పించాలని సూచించారు. రియల్ టైం మానిటరింగ్ చేసేందుకు అవసరం అయిన ఫీచర్లు అన్నీ యాప్‌లో ఉండాలని అన్నారు. నిరంతరం పర్యవేక్షించడం వల్ల సమస్యలను సత్వరం పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల విషయంలో దీర్ఘకాలిక నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు జగన్ చెప్పారు. ఈ యాప్ ద్వారా ప్రజా ప్రతినిధులు, సచివాలయ కార్యదర్శులతో పాటు ప్రజలు కూడా ఫిర్యాదు చేసేలా ఉండాలని సీఎం సూచించారు. ఈ యాప్‌ను రూపొందించే బాధ్యతను పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించారు. ఇక వార్డు/గ్రామ సెక్రటరీలు తమ పరిధిలో ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య రోడ్ల తనిఖీలు చేయాలని కోరారు. రోజు 6 నుంచి 7 కిలోమీటర్ల మేర నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని 4,119 గ్రామ సచివాలయాల పరిధిలో వెంటనే ఈ పని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఈ యాప్ రూపకల్పన జరుగుతున్నా.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా చూడలని సీఎం ఆదేశించారు. యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించడానికి బలోపేతమైన వ్యవస్థను తయారు చేయాలని అన్నారు. ఇకపై వర్షాకాలంలో కూడా రోడ్లు మంచిగా ఉండేలా చూడాలని, దీర్ఘకాలం మన్నేలా రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు.

First Published:  25 Nov 2022 2:14 PM GMT
Next Story