Telugu Global
Andhra Pradesh

ఆ ఒక్కటీ అడక్కండి - జగన్

అన్ని హామీల అమలుకు మూలాధారం మద్యం అమ్మకాలనుంచి వచ్చే ఆదాయం. దాన్ని మాత్రం వదిలిపెట్టేందుకు ప్రభుత్వం సాహసం చేయలేదు. సో ఆ హామీ అలాగే మిగిలిపోయింది.

ఆ ఒక్కటీ అడక్కండి - జగన్
X

2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలతోపాటు, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చామనేది వైసీపీ నేతల వాదన. నవరత్నాలే కాదు, అంతకు మించి ప్రజలకు మంచి చేశామని చెప్పుకుంటారు మంత్రులు, ఎమ్మెల్యేలు. దాదాపుగా ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. కానీ నూటికి నూరుశాతం అనే దగ్గరే కాస్త తేడా వస్తోంది. ఇప్పటి వరకూ మంత్రులు కూడా 95శాతం హామీలు అమలు చేశామంటున్నారు. సీపీఎస్ రద్దు విషయంలో తకరారు నడుస్తోంది. అది కూడా సానుకూలంగా మారితే 97శాతం హామీలు అమలు చేసినట్టవుతుంది. మరి మిగతా 3శాతం సంగతేంటి. సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది హామీగానే మిగిలిపోవాల్సిందేనా..?

వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా హామీలను నూటికి నూరు శాతం అమలు చేస్తుందని, చేయాలని ప్రజలు అనుకోరు. గతంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క హామీకి కొర్రీలు వేసుకుంటూ వచ్చి, చివరకు ఏదీ సంపూర్ణంగా అమలు చేయకుండా చేతులెత్తేశారు చంద్రబాబు. కానీ వైసీపీ మాత్రం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ వచ్చింది. కానీ అన్ని హామీల అమలుకు మూలాధారం మద్యం అమ్మకాలనుంచి వచ్చే ఆదాయం. దాన్ని మాత్రం వదిలిపెట్టేందుకు ప్రభుత్వం సాహసం చేయలేదు. సో ఆ హామీ అలాగే మిగిలిపోయింది.

ఎన్నికలకు వెళ్లేదెలా..?

అన్ని హామీలను నెరవేర్చామనే అబద్ధం జగన్ చెప్పకపోవచ్చు. కానీ ఇటీవల కొంతమంది మంత్రులు అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఎన్నికల హామీ కాదని చెప్పుకొస్తున్నారు. ఆమాటకొస్తే విడతలవారీగా నిషేధం అనేది కూడా అసాధ్యం అనే చెప్పాలి. 3వేల పింఛన్ అనేది వెంటనే సాధ్యం కాకపోయినా విడతలవారీగా అంటూ దాన్ని కొన్నాళ్లపాటు పొడిగించారు. ప్రస్తుతం అది 2750 రూపాయలకు చేరుకుంటోంది, ఎన్నికలకు ముందు కచ్చితంగా 3వేలు చేసే ప్రచారానికి వెళ్తారు. అంటే మిగతా హామీల విషయంలో అసలు జగన్ కు దిగులే లేదు. రాగా పోగా మద్యపాన నిషేధం అనేది మాత్రమే ఆయన సమాధానం చెప్పలేని ప్రశ్నగా మిగిలిపోయింది. దాన్ని పక్కనపెట్టి ఇప్పుడు మూడు రాజధానుల విషయాన్ని హైలెట్ చేసి మూడు ప్రాంతాల అభివృద్ధికోసం వైసీపీకి ఓటు వేయండి అని అభ్యర్థించబోతున్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులే వైసీపీ ప్రధాన అజెండాగా మారబోతున్నాయి. మద్యపాన నిషేధం అనేది మాత్రం ఏపీలో దాదాపుగా అసాధ్యమనే విషయం రుజువైపోయింది.

First Published:  25 Sep 2022 2:48 AM GMT
Next Story