Telugu Global
Andhra Pradesh

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు..? మాకు తెలియాల్సిందే..!!

బాబాయ్ హత్య కేసులో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎంకు ఢిల్లీ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. కేసుల మాఫీ కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని తమకు సమాచారం ఉందన్నారు.

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు..? మాకు తెలియాల్సిందే..!!
X

అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. సడన్ గా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ని కలసి.. ఎప్పటిలాగా విభజన హామీల అమలుపై వినతిపత్రం ఇచ్చారు. ఇచ్చారు సరే, ఏం తెచ్చారు అని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఇదే ప్రశ్నతో అసెంబ్లీలో గొడవకు దిగారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు సభ ప్రారంభం కాగానే మరోసారి ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు, వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. సీఎం జగన్ చాలా సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాను కలిసినా ఆ విషయాలు ప్రజలకు చెప్పడంలేదని, అంత రహస్యమేంటని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు. కనీసం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు కూడా తెలియజేయడంలేదని అన్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్.. ఢిల్లీకి వెళ్లారని, బడ్జెట్ పై జరిగే చర్చల్లో కూడా ఆయన పాల్గొనలేదని చెప్పుకొచ్చారు. అంత రహస్య పర్యటనకు కారణమేంటని నిలదీశారు.

ఏం ఇచ్చారు..? ఏం తెచ్చారు..?

ఢిల్లీ వెళ్లిన జగన్ ఏం సాధించుకొచ్చారంటూ అసెంబ్లీలో నిరసన చేపట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. పోలవరానికి నిధులెంత తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా తెచ్చారా అంటూ నినాదాలు చేశారు. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందంటూ నిరసన తెలిపారు. అప్పర్ భద్ర ఆపారా ? విశాఖ రైల్వేజోన్ తెచ్చారా అంటూ ఆందోళన చేపట్టారు. కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.

సీబీఐ కేసు కోసమేనా..?

బాబాయ్ హత్య కేసులో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎంకు ఢిల్లీ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. కేసుల మాఫీ కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని తమకు సమాచారం ఉందన్నారు. సీఎం అయ్యాక జగన్ 18 సార్లు ఢిల్లీ వెళ్లి 31 రోజులు పాటు అక్కడ ఉన్నారని గుర్తు చేశారు. అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ప్రజలెవ్వరికీ తెలియదన్నారు. వాయిదా తీర్మానంపై నోటీసు ఇచ్చి చర్చకు పట్టుబట్టడమే కాకుండా, పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపే సరికి 11మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.

First Published:  18 March 2023 5:09 AM GMT
Next Story