Telugu Global
Andhra Pradesh

ఆసియాలో టాప్ ట్రెండింగ్.. గిన్నిస్ బుక్ లోకి జగన్ బర్త్ డే

ఇక ఏపీలో కేక్ కటింగ్ లు, సామాజిక కార్యక్రమాలు, వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు.. ఇలాంటి వాటికి లెక్కే లేదు. వైసీపీ నేతలు పోటాపోటీగా జగన్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఆసియాలో టాప్ ట్రెండింగ్.. గిన్నిస్ బుక్ లోకి జగన్ బర్త్ డే
X

జగన్ పుట్టినరోజు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఇదెలా సాధ్యమైందనుకుంటున్నారా.. రక్తదానాలతో ఆ ఘనత సాధించారు వైసీపీ నేతలు. పుట్టినరోజుకి ముందే టీడీపీ అనుకూల మీడియా.. జగన్ బర్త్ డే రోజున బలవంతంగా రక్తదానాలు చేయిస్తున్నారే ఆరోపణలు చేసింది. అయినా కూడా వైసీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. రక్తదానాల్లో రికార్డ్ సృష్టించి జగన్ పుట్టినరోజుని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించారు.

రికార్డ్ ఎలా..?

ఒకేరోజు ఒకే సందర్భంలో సామూహిక రక్తదానం చేయడంలో ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికా పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో ఉండేది. అక్కడ సామాజిక అవగాహన కార్యక్రమం సందర్భంగా గతంలో 72వేల మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకుని రక్తదానం చేశారు. తాజాగా ఆ ఘనత జగన్ బర్త్ డే సొంతం చేసుకుంది. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా లక్షా 30 వేల మంది రక్తదానం కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీంతో జగన్ బర్త్ డే రక్తదానాలను గిన్నిస్ బుక్ సంస్థ గుర్తించింది.

సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్..

సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా కూడా హోరెత్తింది. గతంలో పాదయాత్రలో ఆయనతో కలసి దిగిన ఫొటోలను చాలామంది వాట్సప్ డీపీలుగా పెట్టుకున్నారు. వాట్సప్ స్టేటస్ లో కూడా జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. #HBDYSJagan అనే హ్యాష్ టాగ్‌ తో 5 లక్షల 50 వేలకు పైగా ట్వీట్లు పడ్డాయి. ఆసియాలోనే ఇది నాలుగో అతి పెద్ద ట్రెండింగ్ సబ్జెక్ట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ ఐదో స్థానంలో నిలవడం విశేషం.

ఇక ఏపీలో కేక్ కటింగ్ లు, సామాజిక కార్యక్రమాలు, వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు.. ఇలాంటి వాటికి లెక్కే లేదు. వైసీపీ నేతలు పోటాపోటీగా జగన్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్నిచోట్ల అభిమానం శృతి మించి రెండు వర్గాలు పోటీపడి ఫ్లెక్సీలు వేసి, వాటిని చించేసిన ఘటనలు కూడా జరిగాయి. మొత్తమ్మీద జగన్ 50వ బర్త్ డే గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం విశేషం.

First Published:  22 Dec 2022 6:15 AM GMT
Next Story