Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్సీ ఓటమిపై జగన్ అభిప్రాయం కూడా అదే..!

టీడీపీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవలేదని, అంతమంది ఏడవడం వల్ల, రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిందని అన్నారు. వాపును చూపించి, అది బలం అంటున్నారని, దానికి తోడు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు రావడం వల్ల అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు జగన్.

ఎమ్మెల్సీ ఓటమిపై జగన్ అభిప్రాయం కూడా అదే..!
X

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మూడుచోట్ల వైసీపీ ఓటమి పాలైంది. ఆ మూడు చోట్లా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిలబెట్టిన అభ్యర్థులే గెలిచారు. ఈ ఓటమితో వైసీపీ నేర్చుకునేది ఏమైనా ఉందా అంటే అసలది ఓటమే కాదంటున్నారు అధికార పార్టీ నేతలు. ఎమ్మెల్సీ ఫలితాలొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, టార్గెట్ ఓటర్లు తమ లబ్ధిదారులు కాకపోవడం వల్లే వైసీపీకి ఓట్లు పడలేదన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా సరిగ్గా ఇవే వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ ఓటమికి కారణాలు వివరించారు.

80 లక్షల్లో రెండున్నర లక్షలే ఓటర్లు..

ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఉంటుందని, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారని, అంటే ఎమ్మెల్సీ స్థానం.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధిలో ఉంటుందని వివరించారు జగన్. ఆ పరిధిలో 87శాతం అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వైసీపీ లబ్ధి చేకూర్చిందని, అందులో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారని, వారిలో మెజార్టీ రాకపోయినంత మాత్రాన అధైర్యపడొద్దని సూచించారు.

వారంతా లబ్ధిదారులు కాదు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారని, వారిలో చాలామంది డీబీటీలో లేరని చెప్పుకొచ్చారు. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారని, అది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుందని ప్రశ్నించారు. లబ్ధిదారులందరికీ ఓటు హక్కు ఉంటే కచ్చితంగా వైసీపీదే విజయం అని చెప్పారు.

అందరూ కట్టగట్టుకు వచ్చారు.

వైసీపీ ఎన్నికల్లో ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యాలు ఉన్నాయని, మిగిలిన పార్టీలంతా కలిసినా, వైసీపీ ఒంటరిగా పోటీ చేసిందని గుర్తు చేశారు. అయినా టీడీపీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవలేదని, అంతమంది ఏడవడం వల్ల, రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిందని అన్నారు. వాపును చూపించి, అది బలం అంటున్నారని, దానికి తోడు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు రావడం వల్ల అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు జగన్.

జగన్ అంచనా కరెక్టేనా..?

లబ్ధిదారులు లేరు సరే.. ఆ 2.5 లక్షలమంది ఓటర్లలో సచివాలయ ఉద్యోగుల కుటుంబాలెన్ని, వాలంటీర్ల కుటుంబాలెన్ని, సచివాలయ కన్వీనర్ల కుటుంబాలెన్ని.. ఇలా లెక్క తీసుకుంటూ పోతే దాదాపుగా చాలామంది పట్టభద్రులు ఉంటారు. మరి వారంతా వన్ సైడ్ గా వైసీపీకి ఎందుకు ఓటు వేయలేదు. ఈ లాజిక్ ని వైసీపీ ఎందుకు మిస్సవుతోందనేదే అసలు ప్రశ్న. ఏకపక్షంగా సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు వైసీపీకి పడి ఉంటే కచ్చితంగా తొలి ప్రాధాన్యత ఓటుతోనే ఆ పార్టీ గట్టెక్కేది. పోనీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించినవారంతా పట్టభద్రుల స్థానంలో అదే పార్టీకి ఎందుకు మద్దతు తెలపలేదు, క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగింది. దీనిపై కూడా వైసీపీ పెద్దగా కసరత్తు చేసినట్టు లేదు. అందుకే ఆ నాలుగు ఎమ్మెల్సీలను బాగా లైట్ తీసుకుంది. ఇప్పుడిలా ఫలితాలకు సొంత విశ్లేషణ ఇచ్చుకుంటోంది.

First Published:  3 April 2023 11:23 AM GMT
Next Story