Telugu Global
Andhra Pradesh

వైసీపీ పేరు మరచిపోకూడదంతే.. ఏపీలో వరుస కార్యక్రమాలు

ఇంకా జగన్ దగ్గర బోలెడు ప్లాన్లు ఉన్నాయి. అవన్నీ వరుసగా అమలులోకి వస్తాయి. ఎన్నికల ఏడాదిలో ఏ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రజలు ప్రభుత్వం గురించి, ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి మాట్లాడుకునేలా వీటిని రూపకల్పన చేయించారు జగన్.

వైసీపీ పేరు మరచిపోకూడదంతే.. ఏపీలో వరుస కార్యక్రమాలు
X

2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ పాదయాత్ర చేశారు. దాని ఫలితమే వైసీపీకి 151 సీట్ల భారీ మెజార్టీ. మరి 2024 ఎన్నికల ముందు కూడా ఏదో ఒక హడావిడి ఉండాలి కదా. జగన్ యాత్ర చేసే పరిస్థితి లేదు. మహా అయితే అక్కడక్కడా బహిరంగ సభలు పెడతారు, అభ్యర్థుల తరపున జగన్ ప్రచారం చేపడతారు. ఇదిమాత్రమే సరిపోతుందా..? ఇంకా ఏదో కావాలి. అందుకే జగన్ ఏడాది ముందునుంచే వైసీపీని ప్రజల దగ్గరకు చేర్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో తానొక్కడినే జనం వద్దకు వెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని, పార్టీని కూడా జనం దగ్గరకు పంపిస్తున్నారు. అప్పుడు నవరత్నాలు ఎలా ఉంటాయో వివరించారు, ఇప్పుడు నవరత్నాలు ఎలా అమలవుతున్నాయో చెబుతున్నారు. ఎన్నికల దాకా వైసీపీ వరుస కార్యక్రమాలతో బిజీగా ఉండేలా, నేతల్ని బిజీగా ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు సీఎం జగన్.

ప్రస్తుతం గడప గడప జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో ప్రతి గడపకు ఎమ్మెల్యే వెళ్లాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు జగన్. దానికితోడు మా నమ్మకం నువ్వే జగన్ అనే మరో కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతోంది. ఇందులో కూడా ఎమ్మెల్యేలు, నేతలు ఇంటింటికీ వెళ్తారు. ప్రభుత్వం విషయంలో జనం ఎంత సంతృప్తిగా ఉన్నారో తెలుసుకుంటారు. మరి దీని తర్వాత ఏంటి..? ఇంకా జగన్ దగ్గర బోలెడు ప్లాన్లు ఉన్నాయి. అవన్నీ వరుసగా అమలులోకి వస్తాయి. ఎన్నికల ఏడాదిలో ఏ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రజలు ప్రభుత్వం గురించి, ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి మాట్లాడుకునేలా వీటిని రూపకల్పన చేయించారు జగన్.

వాలంటీర్లకు అవార్డులు..

వాలంటీర్లకి ప్రతి ఏడాదీ ఉగాది నాటికి అవార్డులిస్తామని ప్రకటించినా, ఈసారి వివిధ కారణాలతో అది ఆలస్యమైంది. ఈనెల 14న ఈ ఏడాది అవార్డుల కార్యక్రమం మొదలవుతుంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో లాంఛనంగా జగన్ అవార్డులను వాలంటీర్లకు అందిస్తారు. ఆ తర్వాత నెలరోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

వాలంటీర్లకు వందనం..

వాలంటీర్లకు అవార్డులు ఇవ్వాలంటే జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఒకేరోజు కార్యక్రమం పెట్టుకోవచ్చు, నియోజకవర్గాల వారీగా నిర్వహించినా ఒకేరోజులో పూర్తవుతుంది. కాన్నీ ఈ అవార్డు ప్రదానోత్సవాలను మాసోత్సవాలుగా నెలరోజులపాటు చేయాలనుకుంటున్నారు. నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంలా దీన్ని చేపడతారు. సేవామిత్ర, సేవార రత్న, సేవా వజ్ర పేరుతో ఈ అవార్డులిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,719 మంది వాలంటీ­ర్లను ఈ ఏడాది సత్కరించబోతున్నారు. నగదు బహుమతి కూడా ఉంటుంది.

ప్రతిపక్షాలు పాదయాత్రల పేరుతో జనంలోకి వెళ్తున్నా.. అధికారంలో ఉన్న జగన్, ఎమ్మెల్యేలను నిరంతరం ప్రజలలోనే ఉండాలని సూచిస్తున్నారు. వరుస కార్యక్రమాలతో వారికి బిజీ షెడ్యూల్ ఇచ్చారు. 2024 ఎన్నికలకోసం జగన్ వ్యూహం ఇదే.

First Published:  9 April 2023 9:04 AM GMT
Next Story