Telugu Global
Andhra Pradesh

కోటంరెడ్డి నన్ను చంపేస్తాడు.. కార్పొరేటర్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా తనకు ప్రాణహాని ఉందని వైసీపీ కార్పొరేటర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆరోపించారు.

కోటంరెడ్డి నన్ను చంపేస్తాడు.. కార్పొరేటర్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు
X

నెల్లూరు వైసీపీలో రాజకీయం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ, తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్తూ సంచలనం సృష్టించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పైనే మరో నాయకుడు తీవ్ర ఆరోపణలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా తనకు ప్రాణహాని ఉందని వైసీపీ కార్పొరేటర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో.. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీసేశానని అక్కసుతో.. తనను కోటంరెడ్డి వర్గానికి చెందిన కొంత మంది బెదిరించి, కిడ్నాప్ చేయబోయారని చెప్పారు.

ఈ వ్యవహారంలో తనను పరామర్శిస్తున్నట్లుగా కొంత మంది ఫోన్ చేస్తున్నారని, తనపై దాడి జరిగినట్లుగా ప్రచారం చేస్తూ.. మానసికంగా హింసిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రాణమైనా వదిలేస్తా. కానీ వైసీపీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని విజయ్ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంకటరెడ్డి వైపు చాలా మంది నేతలు ఉంటారని అంచనా వేశారు. నెల్లూరు కార్పొరేషన్‌కు చెందిన కొన్ని డివిజన్లు రూరల్ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. ఇందులో 26 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. వారందరూ కోటంరెడ్డి వైపే ఉంటారని అందరూ భావించారు.

మొదట్లో మెజార్టీ కార్పొరేటర్లు కోటంరెడ్డి వైపే ఉన్నా.. నెమ్మదిగా వారిలోనూ మార్పు కనిపిస్తోంది.తాజాగా విజయ్ భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేశారు. ఫ్లెక్సీల వ్యవహారాన్ని కోటంరెడ్డి పట్టించుకోను అని చెప్పినా.. ఆయన తరపున కొంత మంది తనను బెదిరిస్తున్నారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తనకు ఎప్పుడు, ఎటువైపు నుంచి ప్రాణహాని ఉంటుందో అని భయపడుతున్నానని.. ఏం జరుగుతుందో తాను చెప్పలేనని ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  7 Feb 2023 1:33 AM GMT
Next Story