Telugu Global
Andhra Pradesh

షర్మిల ఎవరి బాణమో తేలిపోయిందా..?

2019 ఎన్నికల్లో అధికారం ఇస్తే ప్రత్యేకహోదా సాధిస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తానని, మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్ మాట తప్పారని ధ్వజమెత్తారు.

షర్మిల ఎవరి బాణమో తేలిపోయిందా..?
X

కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఎవరి బాణమో తేలిపోయింది. ఆమె అచ్చంగా చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తున్నట్లు అర్థ‌మైపోయింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలే అయినా మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న‌ ఆరోపణలు, విమర్శలతో తాను ఎవరి ప్రయోజనాలను రక్షించటానికి పనిచేస్తున్నానో చెప్పకనే చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనిచేస్తున్నట్లే షర్మిల కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు తేలిపోయింది.

తిరుపతి, అనంతపురంలో షర్మిల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై చాలా ప్రశ్నలే సంధించారు. 2014 ఎన్నికల్లో ఏపీ అభివృద్ధికి అనేక హామీలిచ్చి అధికారంలోకి రాగానే అన్నింటినీ తుంగలో తొక్కిన నరేంద్రమోడీని కేడీ అంటూ ఎద్దేవాచేశారు. 2019 ఎన్నికల్లో అధికారం ఇస్తే ప్రత్యేకహోదా సాధిస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తానని, మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్ మాట తప్పారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడుండే వైఎస్సార్ ఎక్కడ ? మాటను తప్పే జగన్ వైఎస్సార్ కు వారసుడు ఎలాగవుతారని నిలదీశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రత్యేకహోదా సాధించలేకపోయారని, పోలవరం ప్రాజెక్టును కట్టలేదని, అసెంబ్లీలో ప్రకటించినట్లు మూడు రాజధానులు నిర్మించలేదన్నారు. ఒక్క పరిశ్రమను కూడా జగన్ తేలేకపోయారని మండిపడ్డారు. వైఎస్ బీజేపీని వ్యతిరేకిస్తే, జగన్ అదే బీజేపీకి బానిసగా మారిపోయారన్నారు. వచ్చేఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటేయాలో జగన్ చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

షర్మిల ప్రశ్నలు బాగానే ఉన్నాయి కానీ, ఇక్కడే ఒక సందేహం మొదలైంది. 2014లో మోడీతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చింది ఎవరు చంద్రబాబే కదా. మోడీ ప్రత్యేకహోదా ఇవ్వకపోతే చంద్రబాబు ఏమిచేశారు..? హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నది చంద్రబాబు. కేంద్రమే నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరంను తనచేతుల్లోకి తీసుకున్నది చంద్రబాబే. ఎందుకు తీసుకున్నారు..? పోలవరం.. సోమవారం అంటూ ఐదేళ్ళు డ్రామాలాడింది చంద్రబాబే కదా..? ఓటుకు నోటు కేసుదెబ్బకు మోడీకి చంద్రబాబు సరెండర్ అయిపోయారు కదా..!

2014 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట తప్పిన మోడీని కేడీ అని సంబోధించిన షర్మిల మరి చంద్రబాబు ఫెయిల్యూర్ల గురించి ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదు..? చంద్రబాబు ఐదేళ్ళ పాలనను వదిలేసి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ గురించి నోటికొచ్చింది మాట్లాడేశారు. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికే రాష్ట్రానికి చంద్రబాబు చేయాల్సిన డ్యామేజి చేసేశారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనను షర్మిల ఎందుకు వదిలేశారు..? జగన్ తో పాటు చంద్రబాబును కూడా ప్రశ్నించుంటే, ఫెయిల్యూర్లను ఎండగట్టుంటే అప్పుడు న్యాయంగా ఉండేది. అలా చేయలేదు కాబట్టే షర్మిల అనే బాణం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు అర్థ‌మైపోయింది.

First Published:  29 Jan 2024 5:33 AM GMT
Next Story