Telugu Global
Andhra Pradesh

బుల్లి రాకెట్ తో ఇస్రో విజయం.. SSLV D2 ప్రయోగం సఫలం

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV తో ఇస్రో తొలి విజయం నమోదు చేసింది.

బుల్లి రాకెట్ తో ఇస్రో విజయం.. SSLV D2 ప్రయోగం సఫలం
X

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV తో ఇస్రో తొలి విజయం నమోదు చేసింది. గతేడాది ఆగస్ట్ లో SSLV D1 ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత కసితో పనిచేశారు శాస్త్రవేత్తలు. లోపాలు తెలుసుకున్నారు, సరిదిద్దుకున్నారు. ఏడాది తిరక్కముందే SSLV D2 ని ప్రయోగించి విజయం అందుకున్నారు. ఈ రాకెట్ ద్వారా మొత్తం మూడు బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశ పెట్టారు.

చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ SSLV. SSLV-D1 సాంకేతిక కారణాలవల్ల విఫలం కావడంతో ఇస్రో వాటిని సరిదిద్దుకుని SSLV-D2 ప్రయోగించింది. ఈ రోజు వేకువజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా, సరిగ్గా 9.18 గంటలకు షార్‌ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.


ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల EOS -07 ఉపగ్రహంతో పాటు అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్‌-1, చెన్నై స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు 750మంది కలసి రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్‌-2ను భూ సమీప కక్ష్యల్లో ఈ రాకెట్ ప్రవేశ పెట్టింది.

రాకెట్‌ ప్రయోగం మొత్తం 15 నిమిషాల్లో పూర్తయిందని తెలిపారు శాస్త్రవేత్తలు. భూ ఉపరితలానికి 450 కిలోమీటర్ల ఎత్తులో EOS -07 శాటిలైట్ ని ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత వరుసగా జానుస్‌-1, ఆజాదీశాట్‌ వాటి కక్ష్యల్లో కుదురుకున్నాయి. దీంతో ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

First Published:  10 Feb 2023 5:22 AM GMT
Next Story