Telugu Global
Andhra Pradesh

ప్రవీణ్ ప్రకాశ్‌ను వైఎస్ జగన్ తిరిగి రాష్ట్రానికి తెచ్చుకుంటున్నారా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్‌ను నియమించారు.

ప్రవీణ్ ప్రకాశ్‌ను వైఎస్ జగన్ తిరిగి రాష్ట్రానికి తెచ్చుకుంటున్నారా?
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవ్వరి మాట వినరు.. తాను అనుకున్నదే చేస్తారనే ముద్ర ఉన్నది. పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు సలహాలు ఇచ్చినా అందులో తనకు నచ్చిన విషయాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారనే వాదన ఉన్నది. అలాంటి సీఎం జగన్ వద్ద కూడా తన మాటను పూర్తిగా చెల్లించుకున్న అధికారిగా ప్రవీణ్ ప్రకాశ్‌కు పేరుంది. ఆయన పేరు చెప్తే ఇప్పటికీ ఏపీలో కొంత మంది సీనియర్ అధికారులు, వైసీపీ నేతలు మండి పడుతుంటారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్‌ను నియమించారు. అప్పటి నుంచి సీఎంవోలో ప్రవీణ్ ప్రకాశ్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా సైడ్ చేసి సీఎం వద్ద ప్రవీణ్ ప్రకాశ్ తన మాట నెగ్గించుకునే వారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎంతటి పనైనా ప్రవీణ్ ప్రకాశ్ తలచుకుంటే అయిపోతుందనే భావన అధికారుల్లోనే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఏర్పడింది. రాను రానూ ప్రవీణ్ ప్రకాశ్ ఆధిపత్యం పెరిగిపోవడంతో పలువురు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు చేశారు. ఆయన వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నది వివరించారు.

పలు వైపుల నుంచి ప్రవీణ్ ప్రకాశ్ మీద ఫిర్యాదులు అందడంతో సీఎం జగన్ ఆయనను పక్కన పెట్టారు. ఏకంగా రాష్ట్రం నుంచే బయటకు పంపించేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. ఉమ్మడి ఏపీ సహా.. విభజన తర్వాత సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, కలెక్టర్, కమిషనర్‌గా పలు బాధ్యతలు నిర్వహించిన ప్రవీణ్ ప్రకాశ్.. ఇప్పుడు అప్రాధాన్య పోస్టులో ఉండటానికి ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. రాష్ట్రానికి తిరగి రావడానికి ఆయన తన వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.

వాళ్లను వీళ్లను పట్టుకుంటే పని కాదని తెలిసిన ప్రవీణ్ ప్రకాశ్.. నేరుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే తన పోస్టు గురించి అడిగినట్లు సమాచారం. ఇటీవల పలుమార్లు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఏపీ భవన్‌లో జగన్‌ను కలిసిన ప్రవీణ్ ప్రకాశ్.. తాను ఏపీకి తిరిగి రావాలని అనుకున్నట్లు చెప్పారు. ఇందుకు వైఎస్ జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది.

ప్రవీణ్ ప్రకాశ్‌పై మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ కలిగి ఉన్న వైఎస్ జగన్.. రాష్ట్రానికి తిరిగి తీసుకొని వచ్చి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయనకు సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో ప్రవీణ్ ప్రకాశ్‌పై వైఎస్ జగన్ వద్ద ఫిర్యాదులు చేసిన అధికారులకు ఆయన తిరిగి వస్తున్నారనే వార్త ఆందోళన కలిగిస్తున్నది. కేవలం ప్రభుత్వ అధికార వర్గంలోనే కాకుండా వైసీపీలో కూడా ప్రవీణ్ ప్రకాశ్ రాక చర్చనీయాంశంగా మారింది.

First Published:  26 Aug 2022 3:22 PM GMT
Next Story