Telugu Global
Andhra Pradesh

కాపుల డిమాండ్లలో లాజిక్కుందా?

జనాభా ఎక్కువగా ఉన్నది కాబట్టి రాజ్యాధికారం దక్కాలన్నదే నిజమైతే కాపుల కన్నా జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి కుర్చీ దక్కాలి కదా. కాబట్టి రాజ్యాధికారాన్ని డిమాండ్లతో కాదు సామర్ధ్యంతోనే సాధించుకోవాలని కాపులు అర్ధం చేసుకోవాలి.

కాపుల డిమాండ్లలో లాజిక్కుందా?
X

కాపు నేతల్లో కొందరి డిమాండ్లు తర్కానికి అందకుండా ఉంటోంది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన కాపునాడు సమావేశంలో కూడా కొందరు వక్తలు తర్కానికి ఏ మాత్రం సంబంధం లేకుండా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే జనాభాలో 4-5 శాతం కూడా లేని సామాజిక వర్గాలే రాజ్యాధికారంలో ఉన్నాయని, మిగిలిన సామాజిక వర్గాలను ఏలుతున్నాయంటు గోలపెట్టేశారు. అంటే వక్తల ఉద్దేశం ఏమిటంటే కమ్మలు, రెడ్లే ఎక్కువగా ముఖ్యమంత్రులయ్యారనేది వీళ్ళ బాధ.

జనాభాలో 19 శాతం ఉన్నపుడు కాపులకు రాజ్యాధికారం ఎందుకు రావటం లేదని, ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు దక్కటం లేదన్నది వీళ్ళ పాయింట్. వీళ్ళ పాయింట్లోనే ఆలోచిస్తే ఇందుకు సమాధానం దొరుకుతుంది. 19 శాతం ఉన్న కాపులకు ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు దొరకటం లేదు? 4 - 5 శాతం మాత్రమే ఉన్న రెడ్డి, కమ్మోరికి ఎలా దక్కుతోంది? ముఖ్యమంత్రి అయ్యే దమ్ము, సామర్ధ్యం సామాజికవర్గంలో కాదు నాయకుల్లో దమ్ముండాలి. ముఖ్యమంత్రి కుర్చీ అనేది జనాభా ప్రాతిపదికన రావటానికి ఇదేమీ రిజర్వేషన్ ద్వారా అందుకునే సౌకర్యం కాదని కాపులు గ్రహించాలి.

పార్టీలో సామర్ధ్యాన్ని నిరూపించుకుని, జనాలను తన నాయకత్వంతో మెప్పించి, ఆమోదం పొందితేనే ముఖ్యమంత్రి కుర్చి దక్కుతుందన్న చిన్న లాజిక్‌ను కాపులు మరచిపోతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో సీఎంలుగా పనిచేసిన ప్రకాశం పంతులు నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు అధిష్టానాన్ని మెప్పించి సీఎంలయ్యారు. వైఎస్సార్ ఇటు జనామోదంతో పాటు అటు అధిష్టానాన్నీ మెప్పించి సీఎం అయ్యారు.

అలాగే ఎన్టీయార్ విశేష జనాధరణతో సీఎం అయ్యారు. ఇక చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఎలాగయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా జనామోదంతో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. సీఎం అయిపోవాలని పార్టీ పెట్టిన చిరంజీవి ఫెయిలయ్యారు. ఎందుకంటే జనామోదం లభించలేదు. ఈ విషయాలను కాపులు ఎందుకు ఆలోచించటంలేదు.

జనాభా ఎక్కువగా ఉన్నది కాబట్టి రాజ్యాధికారం దక్కాలన్నదే నిజమైతే కాపుల కన్నా జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి కుర్చీ దక్కాలి కదా. కాబట్టి రాజ్యాధికారాన్ని డిమాండ్లతో కాదు సామర్ధ్యంతోనే సాధించుకోవాలని కాపులు అర్ధం చేసుకోవాలి. లేకపోతే ఎంతకాలమైనా ఇలాగ లాజిక్కులేని డిమాండ్లు చేస్తునే ఉండాలంతే.

First Published:  31 Dec 2022 6:37 AM GMT
Next Story