Telugu Global
Andhra Pradesh

ఇంతకన్నా హ్యాపీయెస్ట్ అధినేత ఉన్నారా..?

మొదటినుంచి జనసేన అధినేత రూటే సపరేటు. పార్టీ పెట్టి పదేళ్ళయ్యింది. అన్నీ నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఇన్‌చార్జ్‌లు లేరు. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీచేసే గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలన్న చింతలేదు.

ఇంతకన్నా హ్యాపీయెస్ట్ అధినేత ఉన్నారా..?
X

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. ఇందులో కొన్ని జాతీయపార్టీలు, మరికొన్ని ప్రాంతీయపార్టీలు. పార్టీ ఏదైనా దాని అధ్యక్షులు కావచ్చు లేదా అధినేతలు కావచ్చు 24 గంటలూ 365 రోజులు పనులతో, ఒత్తిళ్ళతో సతమతమైపోతుంటారు. మిగిలిన పార్టీల సంగతిని వదిలేసినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోజువారీ వ్యవహారాలను చాలామంది చూస్తూనే ఉంటారు. వీళ్ళకి కుటుంబ సభ్యులను కలవటానికి, తీరిగ్గా భోజనం చేయటానికి కూడా సమయం ఉండదు.

ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, టికెట్లు ఇవ్వదలచుకోని వాళ్ళని బుజ్జగించటం, వాళ్ళ అలకలను తీర్చేందుకు హామీలివ్వటం, నియోజకవర్గాల్లో మార్పులు చేయటం ఇలా రకరకాల వ్యవహారాల్లో ఇటు జగన్, అటు చంద్రబాబు ఊపిరి తీసుకోడానికి స‌మ‌యంలేనంత బిజీగా ఉంటారు. వీళ్ళిద్దరు ఇంత బిజీగా ఉన్న సమయంలో కూడా ఒకే ఒక పార్టీ అధినేత ఏమీ పట్టనట్లుగా హ్యాపీగా గడిపేస్తున్నారు. ఆయనే జనసేన అధినేత పవన్ కల్యాణ్.

మొదటినుంచి జనసేన అధినేత రూటే సపరేటు. పార్టీ పెట్టి పదేళ్ళయ్యింది. అన్నీ నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఇన్‌చార్జ్‌లు లేరు. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీచేసే గట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలన్న చింతలేదు. ఎవరు గెలుస్తారో అని సర్వేలు చేయించుకోవాలన్న అవసరమే లేదు. నియోజకవర్గాల్లో ఎవరు పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎంతున్నాయని విశ్లేషించుకునే పనేలేదు. టికెట్ నిరాకరిస్తే ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతారనే చింత అసలేలేదు. ఇతర పార్టీల నుంచి జనసేనలోకి గట్టి నేతలు వచ్చి చేరుతారన్న ఆశాలేదు. కుమ్ములాటలు లేవు, అంతర్గత విభేదాలు లేవు. నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు అసలే లేవు.

ఎందుకంటే.. పార్టీని బలోపేతం చేసుకోవాలి, అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేయాలి, ఇతర పార్టీల అభ్యర్థ‌/లకు దీటుగా జనసేన తరఫున గెలుపు గుర్రాలను పోటీలోకి దింపాలన్న చింతకూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ ‘ఇంకెవరో’ చూసుకుంటారన్నధీమా. ఈ ధీమాతోనే తన నిర్ణయాలను ప్రశ్నించే వాళ్ళని పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపొమ్మని చెప్పింది. బహుశా ఏ అధినేత కూడా పవన్ చెప్పినట్లు చెప్పరేమో. అందుకనే పవన్ కు మించిన హ్యాపీయెస్ట్ అధినేత ఎవరుంటారు ?

First Published:  15 Dec 2023 3:51 AM GMT
Next Story