Telugu Global
Andhra Pradesh

ఈ ఫార్ములా జగన్‌కు ప్లస్సా, మైనస్సా?

అదేమిటంటే నామినేషన్ వేస్తే ఎమ్మెల్సీ అయిపోవటమే అన్నట్లున్న స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మహిళ, కాపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో నామినేషన్లు వేసి హోరాహోరీగా పోరాడాల్సిన స్థానాల్లో ఎక్కువగా సొంత సామాజికవర్గంకు టికెట్లు కేటాయించారు.

ఈ ఫార్ములా జగన్‌కు ప్లస్సా, మైనస్సా?
X

ఇప్పుడు జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఫార్ములా ప్రకారం వెళుతున్నట్లు అర్థ‌మవుతోంది. అదేమిటంటే నామినేషన్ వేస్తే ఎమ్మెల్సీ అయిపోవటమే అన్నట్లున్న స్థానాల్లో ఏమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మహిళ, కాపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వీరిలో కూడా బీసీలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అందరు చూసిందే. ఇదే సమయంలో నామినేషన్లు వేసి హోరాహోరీగా పోరాడాల్సిన స్థానాల్లో ఎక్కువగా సొంత సామాజికవర్గంకు టికెట్లు కేటాయించారు.

ఈ ఫార్ములా ద్వారా జగన్ పంపిన మెసేజ్ ఏమిటంటే గెలుపు గ్యారెంటి స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, కాపు సామాజికవర్గాలతో పాటు మహిళలకు కేటాయిస్తానని. అలాగే గెలుపు కోసం తీవ్రంగా కష్టపడాల్సిన స్థానాలు, ఎంత కష్టపడినా గెలుస్తామనే నమ్మకంలేని స్థానాల్లో రెడ్లను పోటీకి దింపాననే మెసేజ్‌ను జగన్ పై సామాజికవర్గాలకు పంపారు. స్థానిక సంస్థలు, గవర్నర్, ఎమ్మెల్యేల కోటాలో ఈజీగా ఎమ్మెల్సీలు అయిపోయే స్థానాలకు పై వర్గాలకు చెందిన నేతలను ఎంపిక చేశారు.

ఇక టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు జరగబోయే 5 స్థానాల ఎన్నికల్లో ఎక్కువగా రెడ్లనే పోటీలోకి దింపారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరులో పేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి, కడప-అనంతపురం, నెల్లూరు స్థానానికి వెన్నపూస రవీంద్రరెడ్డి, ఉత్తరాంధ్ర స్థానానికి సీతంరాజు సుధాకర్ పోటీ చేస్తున్నారు. టీచర్ నియోజకవర్గాల్లో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరులో చంద్రశేఖరరెడ్డి, కడప-అనంతపురం-కర్నూలు పశ్చిమరామలసీమ నియోజకవర్గంలో ఎంవీ రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు.

గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల్లో గెలవాలంటే వైసీపీ అభ్యర్థులు చాలా కష్టపడాల్సుంటుంది. ఎందుకంటే వీళ్ళకు ఓట్లేయాల్సింది గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులే. ఈ సెక్షన్లలో ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే వైసీపీ అభ్యర్థులు ఎంత కష్టపడినా గెలుపు గ్యారెంటీలేదు. నామినేషన్ వేస్తే ఎమ్మెల్సీలు అయిపోయినట్లే అనుకున్న కోటాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, కాపు, మహిళలకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను అనే విషయాన్ని జగన్ స్పష్టంగా చెప్పారు. మరీ ఫార్ములా జగన్‌కు ప్లస్‌ అవుతుందో లేకపోతే మైనస్ అవుతుందో చూడాల్సిందే.

First Published:  28 Feb 2023 5:53 AM GMT
Next Story