Telugu Global
Andhra Pradesh

పవన్‌ని చంద్రబాబు ఫిక్స్ చేస్తున్నారా..?

తనపై ఆరోపణలకు చాలాకాలం పవనే రెస్పాండ్ కాకపోతే ఇక చంద్రబాబుకు అవసరం ఏముంది..? అందుకనే జగన్మోహన్ రెడ్డి అండ్ కో పవన్‌ను ఎంత టార్గెట్ చేస్తున్నా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు.

పవన్‌ని చంద్రబాబు ఫిక్స్ చేస్తున్నారా..?
X

తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. రెండు పార్టీల అధినేతలు తాము పొత్తులు పెట్టుకుంటామని విడివిడిగా చెబుతారు. అయితే అందుకు అవసరమైన ప్రక్రియను మాత్రం మొదలుపెట్టరు. ఎదుటివాళ్ళతో అవసరం తీరేంత వరకు ఎలా వ్యవహరించాలో చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇలాగే వ్యవహరిస్తుంటారని సరిపెట్టుకోవాల్సిందే. ఈ వైఖరే జనసేన నేతలకు మింగుడుపడటంలేదు. పవన్‌ను వైసీపీ నేతలు పదేపదే టార్గెట్ చేస్తుంటే చంద్రబాబు నోరుమెదకపోవటాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యానారాయణ చంద్రబాబును ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే ‘పవన్ కల్యాణ్ గారిని ప్యాకేజీస్టార్, దత్తపుత్రుడని వైసీపీ కుక్కలు మొరుగుతున్నాయి.. తమ అంటే చంద్రబాబు పల్లకీని పవన్ మోస్తున్నట్లు రాష్ట్రమంతా ఫ్లెక్సీలు పెట్టారట.. వైసీపీ కుక్కలు అంతగా పవన్‌ను తిడుతున్నా, ఫ్లెక్సీలు పెట్టి అవమానిస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు’ అని చంద్రబాబును సూటిగా అడిగారు. ‘ప్రజల్లోని అపోహలు తొలగాలంటే వెంటనే చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిందే’ అని బొలిశెట్టి డిమాండ్ చేశారు.


ట్వీట్ చదివిన తర్వాత పవన్ పరువును కాపాడమని చంద్రబాబును జనసేన నేతలు ఎంతగా బతిమలాడుకుంటున్నారో అర్థ‌మైపోతోంది. ట్విట్టర్లోనే చంద్రబాబును బతిమలాడుకుంటున్నారంటే.. పార్టీ నేతల మధ్య అంతర్గతంగా ఇంకెంతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయో అర్థంచేసుకోవచ్చు. వైసీపీ నేతలు పవన్‌ను టార్గెట్ చేయటం ఇప్పుడే మొదలుపెట్టలేదు. చాలాకాలంగా ఇదే విధంగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ఆరోపణలకు చాలాకాలం అసలు పవనే రెస్పాండ్ కాలేదు.

తనపై ఆరోపణలకు చాలాకాలం పవనే రెస్పాండ్ కాకపోతే ఇక చంద్రబాబుకు అవసరం ఏముంది..? అందుకనే జగన్మోహన్ రెడ్డి అండ్ కో పవన్‌ను ఎంత టార్గెట్ చేస్తున్నా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. బహుశా చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదేనేమో.. వైసీపీ ఎంతగా టార్గెట్ చేస్తే పవన్ అంతగా చంద్రబాబు వైపున‌కు జరుగుతారు. అంటే తన దగ్గరకు రాక మరోదారిలేకుండా పవన్‌ను చంద్రబాబు ఫిక్స్ చేస్తున్నట్లు అర్థ‌మవుతోంది. పవన్ కు చంద్రబాబు వ్యవహారం పూర్తిగా తెలీకపోవచ్చు కానీ, చాలాకాలం కాంగ్రెస్ నేతగా ఉన్న బొలిశెట్టికి కూడా తెలీదా..?

First Published:  31 May 2023 4:12 AM GMT
Next Story