Telugu Global
Andhra Pradesh

వర్మ ‘వ్యూహా’నికి టీడీపీ భయపడుతోందా..?

వ్యూహం సినిమాను థియేటర్లలోనే కాకుండా సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీల్లో కూడా విడుదల చేసేందుకు లేదని హైకోర్టు ఆదేశించటమే ఆశ్చర్యంగా ఉంది.

వర్మ ‘వ్యూహా’నికి టీడీపీ భయపడుతోందా..?
X

సినీ న‌టుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒక సినిమాను చూసి భయపడుతుండటం ఆశ్చర్యంగా ఉంది. రాంగోపాల్‌ వర్మ తీసిన వ్యూహం సినిమా విడుదలను అడ్డుకునేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కోర్టుల్లో పదేపదే కేసులు వేసి సినిమా విడుదలను టీడీపీనే అడ్డుకుంటోంది. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేయాలని టీడీపీ మద్దతుదారులు కోర్టుల్లో కేసులు వేశారు. సినిమా విడుదలకు వీల్లేదంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీచేశాయి.

వ్యూహం సినిమాను థియేటర్లలోనే కాకుండా సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీల్లో కూడా విడుదల చేసేందుకు లేదని హైకోర్టు ఆదేశించటమే ఆశ్చర్యంగా ఉంది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను జనవరి 11వ తేదీవరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఉత్తర్వులను కాసేపు పక్కన పెట్టేస్తే ఒక సినిమాను అడ్డుకోవాలని మద్దతుదారులతో టీడీపీ కోర్టుల్లో కేసులు వేయించటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబునాయుడు, తన ఇమేజిని దెబ్బతీయటమే లక్ష్యంగా వర్మ వ్యూహం సినిమా తీసినట్లు లోకేష్ ఆరోపించారు.

తమ ఇమేజిని దెబ్బతీసేట్లుగా సినిమా తీస్తే తాము అడ్డుకోకుండా చూస్తూ ఎలా ఊరుకుంటామని లోకేష్ ప్రశ్నించారు. లోకేష్ ప్రశ్నించటంలోనే తెలిసిపోతోంది వ్యూహం సినిమా అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో.. ఇంతకీ వ్యూహం సినిమాలో ఏముంది అన్నది చూస్తే కానీ తెలీదు. అయితే రిలీజైన టీజర్ల ప్రకారం సినిమాలో కంటెంట్ తమను బ్యాడ్ గా చూపించినట్లు లోకేష్ మండిపడుతున్నారు. అంటే వ్యూహం సినిమాను జనాలు చూస్తే టీడీపీకి ఓట్లేయరని లోకేష్ భయపడుతున్నట్లు అర్థ‌మవుతోంది.

ఒక సినిమాలో తమ క్యారెక్టర్లను బ్యాడ్ గా చూపించినంత మాత్రాన జనాలు నమ్మేసి టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారని లోకేష్ భయపడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్మ తీసిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ను కూడా విడుదల కాకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. వర్మేమో తన వ్యూహం సినిమాలో యథార్థంగా జరిగిన, తాను సేకరించిన వివరాల ఆధారంగానే సినిమా తీసినట్లు చెప్పుకుంటున్నారు. ఒక్క సినిమాలో క్యారెక్టర్లకే డ్యామేజి అయిపోయేంత ఇమేజీనా చంద్రబాబు, లోకేష్‌ది..?

First Published:  31 Dec 2023 4:11 AM GMT
Next Story