Telugu Global
Andhra Pradesh

బిజెపి తో ప‌వ‌న్ విసిగిపోయారా.. ? దూరం జ‌రుగుతారా..?

పవన్ కళ్యాణ్ కు బీజెపికీ మధ్య దూరం పెరుగుతున్న సూచనలు కనపడుతున్నాయి. 'బీజేపీ నాయకులపై గౌరవం ఉంది కానీ ఊడిగం చేయలేం కదా' అని ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.

బిజెపి తో ప‌వ‌న్ విసిగిపోయారా.. ? దూరం జ‌రుగుతారా..?
X

జ‌న‌సేన కు బిజెపి మ‌ధ్య దూరం పెరుగుతోందా..పొత్తులు ఉన్నాస‌ఖ్య‌త కొర‌వ‌డిందా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. మంగ‌ళ‌వారంనాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరావేశంతో దాదాపు గంట‌న్న‌ర‌కు పైగా చేసిన ప్ర‌సంగం సంద‌ర్భంలో ఆయ‌న బిజెపి ప్ర‌స్తావ‌న కూడా తెచ్చారు.

" బిజెపితో పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డో ఏదో తేడాగా ఉంది. క‌లిసి ప‌నిచేద్దాం రోడ్ మ్యాప్ ఇవ్వండంటూ అడిగాను. కానీ నేటి వ‌ర‌కూ అటువైపునుంచి ఎటువంటి స్పంద‌నా లేదు. ఇంకెంత కాలం వేచి ఉండాలి..స‌మ‌యం వృధా అయిపోతోంది. బిజెపితో క‌లిసి పోరాడ‌దామ‌న్నా ఎవ‌రు ముందుకు రావవ‌డం లేదు. ఆ విష‌యం వాళ్ళ‌కీ తెలుసు.. మాకూ తెలుసు. బిజెపి అన్నా ఆ నాయ‌కుల‌న్నా మాకు గౌర‌వం ఉంది. ఎంతో కాలంగా పోరాడిన నాయ‌కులు ఉన్నారు. కానీ ఎంత‌కాలం.. గౌర‌వం ఉంది క‌దా అని ఊడిగం చేయ‌లేం." అని ప‌వ‌న్ స్ప‌ష్టం గా చెప్పారు.

ప‌వ‌న్ ఇంకా మాట్లాడుతూ.. త‌న‌కు ప‌ద‌వుల పై ఆశ‌లు లేవ‌న్నారు. కానీ రాష్ట్రంలో రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే.. ప్రజలను కాపాడుకోవడానికి తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు.

ఆయ‌న వ్యాఖ్య‌లు చూస్తుంటే బిజెపి తీరుతో ఆయ‌న విసిగిపోయారా? అనే సందేహాలు క‌లుగుతున్నాయి. విశాఖ లో ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌లో తెలుగుదేశం ఇత‌రులు స్పందించి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం తీరును విమ‌ర్శించారు. కానీ బిజెపి నాయ‌కులెవ‌రూ వెంట‌నే స్పందించ‌లేదు. మ‌రుస‌టి రోజు రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ విష‌యాల‌ను నేరుగా కేంద్రం దృష్టికి తీసుకెళ‌తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు బిజెపి ఈ విష‌యాల‌పై స్పందించ‌క‌పోవ‌చ్చ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం బిజెపి ఫోక‌స్ తెలంగాణ‌లోని మునుగోడు ఉప ఎన్నిక‌, గుజ‌రాత్, హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనే ఉంది. మ‌రి కొంత కాలం వ‌ర‌కూ బిజెపి ఈ సాగ‌దీత ధోర‌ణినే కొన‌సాగించ‌వ‌చ్చంటున్నారు.

ఈ ప‌రిణామాల నేపథ్యంలో ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల ఆంత‌ర్యం ఏమై ఉంటుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. గ‌తంలో జ‌రిగిన ప‌రిస్థితుల‌ను గుర్తుకు తెచ్చుకుంటూ భ‌విష్య‌త్తులో ఈ రెండు పార్టీల‌ మ‌ధ్య ఏ మేర‌కు స‌ఖ్య‌త ఉంటుందోన‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

First Published:  18 Oct 2022 1:30 PM GMT
Next Story