Telugu Global
Andhra Pradesh

'ఆహా'ను బాలయ్య సొంత అవసరాలకు వాడుతున్నారా?

అన్ స్టాపబుల్ మూడో సీజన్ తాజాగా ప్రారంభం కానుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి అతిథులుగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి టీమ్ హాజరవుతోంది.

ఆహాను బాలయ్య సొంత అవసరాలకు వాడుతున్నారా?
X

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నెలకొల్పిన ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా. పూర్తిగా తెలుగు కంటెంట్ ను అందించే తొలి యాప్‌గా ఇది ప్రారంభమైంది. అయితే ఆరంభంలో ఈ యాప్ కు అనుకున్నంత స్థాయిలో ఆదరణ దక్కలేదు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో ప్రారంభమైన తర్వాతే ఆహా ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. అన్ స్టాపబుల్ షో తొలి సీజన్ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే బాలకృష్ణ సెకండ్ సీజన్ నుంచి ఆహాను తన సొంత అవసరాల కోసం ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఆ సీజన్లో చంద్రబాబు, నారా లోకేష్ ను షోకు అతిథులుగా పిలిచి ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న ప్రచారంలో నిజం లేదని వివరించే ప్రయత్నం చేశారు. ఆనాడు జరిగిన సంఘటనలను తమకు అనుకూలంగా మలుచుకుని వివరించే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ మూడో సీజన్ తాజాగా ప్రారంభం కానుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి అతిథులుగా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి టీమ్ హాజరవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోను చూస్తే మరోసారి బాలకృష్ణ తన రాజకీయ అవసరాల కోసం అన్ స్టాపబుల్ వేదికను వాడుకున్నట్లు అర్థమవుతుంది.

సిల్క్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ రాజకీయంగా క్రియాశీలకంగా మారాడు. వైసీపీ ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు అన్ స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ జగన్ పై పరోక్ష విమర్శలు చేశాడు. 'మేము తప్పు చేయలేదని మీకు తెలుసు.. మేము తలవంచమని మీకు తెలుసు. మనల్ని ఆపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు. అనిపించింది అందాం. అనుకున్నది చేద్దాం. ఎవడు ఆపుతాడో చూద్దాం' అని ఒక డైలాగ్..' సినిమా అయినా.. లైఫ్ లో అయినా.. అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకి రావాలి' అని మరో డైలాగ్ పేల్చాడు బాలయ్య.

బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించే బాలకృష్ణ ఈ కామెంట్స్ చేశాడని ప్రచారం జరుగుతోంది. తెలుగు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి అల్లు అరవింద్ ఆహా యాప్ ను తీసుకురాగా బాలకృష్ణ మాత్రం ఆ వేదిక‌ను తన సొంత రాజకీయాలకు వాడుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ రాజకీయాలకు మధ్యలో అల్లు అరవింద్ ఇరుక్కుపోయినట్లు అనిపిస్తోంది.

First Published:  14 Oct 2023 6:17 AM GMT
Next Story