Telugu Global
Andhra Pradesh

పవన్‌లో ఉక్రోషం పెరిగిపోతోందా..?

ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్మోహన్‌ రెడ్డి మీద తనకున్న మంటే జనాలందరికీ ఉండాలని పవన్‌ కోరుకుంటున్నారు. అందుకనే ప్రభుత్వంపై తిరగబడమని పదేపదే చెబుతున్నారు.

పవన్‌లో ఉక్రోషం పెరిగిపోతోందా..?
X

ఆంధ్ర రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రిలీజ్‌ చేసిన ప్రెస్‌నోట్‌ చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. అక్రమార్కుల పాలనను కర్మ అనుకుందామా అంటూ తన బాధనంతా వెళ్ళగక్కారు. ప్రభుత్వంపై తిరగబడమని జనాలకు ఎన్నిసార్లు పిలుపిస్తున్నా ఎందుకు చైతన్యం కనిపించటం లేదంటూ నిలదీశారు. ద్వితీయశ్రేణి పౌరులుగా చూసిన వివక్షను తట్టుకోలేకే పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షచేసి తెలుగువారిలో చైతన్యం తెచ్చారని గుర్తుచేశారు.

నిజానికి పొట్టి శ్రీరాములు దీక్షచేసిన కారణానికి రాష్ట్రంలో ఇప్పటి పరిస్ధితులకు పోలికేలేదు. రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా జనాల్లో ఎందుకు చైతన్యం కనిపించటంలేదంటూ మండిపోయారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ చేజారిపోతున్నా జనాలు ఎందుకు పట్టించుకోవటంలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నా జనాలకు పట్టడంలేదా అంటూ నిలదీశారు. కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నా ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటంలేదంటూ ఆశ్చర్యపోయారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్మోహన్‌ రెడ్డి మీద తనకున్న మంటే జనాలందరికీ ఉండాలని పవన్‌ కోరుకుంటున్నారు. అందుకనే ప్రభుత్వంపై తిరగబడమని పదేపదే చెబుతున్నారు. అయినా జనాలు పట్టించుకోకపోయేసరికి మీలో చైతన్యం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే విశాఖస్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వానిది. తన ప్లాంటును తాను ప్రైవేటీకరిస్తానంటే రాష్ట్రప్రభుత్వం ఏమి చేయగలదు..? అప్పటికీ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని తమకు అప్పగించమని జగన్‌ ప్రధానమంత్రికి లేఖరాశారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు.

ఇక బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి తాను ఏమిచేశాడో మాత్రం చెప్పటంలేదు. ఇక పరిశ్రమలు తరలిపోతున్నాయని గోలచేస్తున్నాడు. ఏ పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటే మాత్రం సమాధానం చెప్పరు. జగన్‌ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచాలన్నది పవన్‌ ఉద్దేశ్యం. రాజకీయ పార్టీ నేతగా పవన్‌ ప్రయత్నాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వంపై జనాల్లో అంత వ్యతిరేకతుందా అని ఆలోచించాలి. లేని వ్యతిరేకతను ఉందనుకుని రెచ్చగొడుతున్నారు కాబట్టే జనాలు పట్టించుకోవటంలేదు. అందుకనే పవన్‌లో ఉక్రోషం రోజురోజుకు పెరిగిపోతోంది. మరిది ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.

First Published:  2 Nov 2022 4:18 AM GMT
Next Story