Telugu Global
Andhra Pradesh

ఐపీఎస్, ఐఏఎస్‌ల యాత్ర‌ల మ‌ర్మ‌మేమిటో?

ఈ యాత్ర‌ల‌న్నీ రాజ‌కీయ అరంగేట్రానికి స‌న్నాహాల‌ని ప్ర‌చారం సాగుతోంది. సీనియ‌ర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎక్క‌డ నుంచి పోటీకి దిగుతారో, ఏ పార్టీ నుంచి దిగుతారో అనేది మాత్రం స్ప‌ష్టం కాలేదు.

ఐపీఎస్, ఐఏఎస్‌ల యాత్ర‌ల మ‌ర్మ‌మేమిటో?
X

రాజ‌కీయ పార్టీల నేత‌ల పాద‌యాత్ర‌లు ఎందుకో మ‌న‌కి తెలుసు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ర‌క‌ర‌కాల పేర్లు, ల‌క్ష్యాల‌తో యాత్ర‌లు చేస్తున్నారు. వీటి వెనుక వారి రాజ‌కీయ ఆస‌క్తులు మాత్ర‌మే ఉన్నాయ‌నేది వాస్త‌వం. కానీ ఏదో ఒక వ‌ర్గం హ‌క్కులు పేరుతో ఈ యాత్ర‌లు ఆరంభం అవుతున్నాయి.

ఏపీ ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్‌కి సొంతంగా ఏఐఎమ్ (అంబేద్క‌ర్స్ ఇండియా మిష‌న్) అనే సంస్థ ఉంది. ఈ సంస్థ మ‌న‌వాడ‌-మ‌న పంచాయ‌తీ నినాదంతో ముందుకెళుతోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఒక రాజ‌కీయ పార్టీ మాదిరి కార్య‌వ‌ర్గాలు ఏర్పాటు చేశారు. దీనికి మీడియా విభాగం, సోష‌ల్ మీడియా వింగ్ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ద‌ళిత‌వాడ‌లు, కాల‌నీల‌ను ప్ర‌త్యేక పంచాయ‌తీలుగా గుర్తించాల‌నేది ఐపీఎస్ సునీల్ కుమార్ అజెండా. ఈ అజెండా కంటే ఏదో ఒక జెండాతో పోటీ చేయాల‌నే ఆస‌క్తి ఎక్కువ అనే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఏపీ సీఐడీ చీఫ్‌గా ఆయ‌న‌ సంచ‌ల‌నాల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకుంది. ఒక‌వైపు ఉద్యోగ బాధ్యతలు చూస్తూనే, మ‌రోవైపు ఏఐఎమ్ ద్వారా త‌న ల‌క్ష్యాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్లే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్కువ‌గా గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించే సునీల్ కుమార్ రాయలసీమ జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌కి సిద్ధం అవుతున్నారు. ఆగస్టు 4న నంద్యాల జిల్లాలో పర్యటించి త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ని ప్ర‌క‌టిస్తార‌ని ఏఐఎమ్‌ రాష్ట్ర క‌మిటీ ప్ర‌చారం చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాను పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించే చాన్స్ ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్ కూడా త‌డ నుంచి తుని వ‌ర‌కూ పాద‌యాత్ర చేప‌డుతున్నారు. కలెక్టర్‌గా, కీలక శాఖలకు సెక్రటరీగా పనిచేసిన విజయ్ కుమార్‌ రిటైర‌య్యాక ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా ఈ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇటీవ‌ల‌ నెల్లూరు, ఒంగోలు, విజయవాడలో దళిత, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. అనంత‌రం ‘ఐక్యత విజయపథం’ అనే పేరుతో తడ నుంచి తుని వరకు యాత్ర చేస్తారంటూ పోస్ట‌ర్లు రిలీజ్ చేశారు. ఈ యాత్ర‌ల‌న్నీ రాజ‌కీయ అరంగేట్రానికి స‌న్నాహాల‌ని ప్ర‌చారం సాగుతోంది. సీనియ‌ర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎక్క‌డ నుంచి పోటీకి దిగుతారో, ఏ పార్టీ నుంచి దిగుతారో అనేది మాత్రం స్ప‌ష్టం కాలేదు. అయితే వైసీపీతో మంచి అనుబంధం ఉన్న ఇద్ద‌రు సీనియ‌ర్ సివిల్ స‌ర్వీస్ అధికారులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ ఆశిస్తున్నార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

First Published:  29 July 2023 3:17 PM GMT
Next Story