Telugu Global
Andhra Pradesh

రాబిన్ శర్మ ఎక్కువ రోజులు ఉండడు.. టీడీపీ నేతల ఆసక్తికరమైన చర్చ

రాబిన్ శర్మ గత కొంత కాలంగా ఏపీలో టీడీపీ తరపున పని చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెర వెనుక ఉండి పని చేసిన రాబిన్ శర్మను.. శనివారం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు పరిచయం చేశారు.

రాబిన్ శర్మ ఎక్కువ రోజులు ఉండడు.. టీడీపీ నేతల ఆసక్తికరమైన చర్చ
X

ఏపీ అసెంబ్లీకి 2024లో జరుగనున్న ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికలు చావో రేవో మాదిరిగా తయారయ్యాయి. ఈ సారి కనుక ఓడిపోతే పార్టీకి తెలంగాణలో పట్టిన గతే పడుతుందని అధినేత చంద్రబాబు ఆందోళనగా ఉన్నారు. తన వారసుడిగా నారా లోకేశ్‌ను పూర్తి స్థాయిలో నిలబెట్టాలంటే 2024లో అధికారంలోకి రావల్సిందే. ఇందు కోసం అవసరమైన వ్యూహాలన్నీ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పార్టీలన్నీ పొలిటికల్ స్ట్రాటజిస్టులను నియమించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా 'షోటైమ్ కన్సల్టింగ్'కు చెందిన రాబిన్ శర్మను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నది.

రాబిన్ శర్మ గత కొంత కాలంగా ఏపీలో టీడీపీ తరపున పని చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెర వెనుక ఉండి పని చేసిన రాబిన్ శర్మను.. శనివారం చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు పరిచయం చేశారు. ఇటీవల టీడీపీ అధికార వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలను చేపట్టింది. వీటి వెనుక రాబిన్ శర్మ వ్యూహాలు ఉన్నాయి. లోకేశ్ పాదయాత్ర ప్లాన్ కూడా ఆయనదే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాబిన్ శర్మ ఎక్కువ కాలం కొనసాగుతారని భావించడం లేదని కొంత మంది టీడీపీ నేతలు అంటున్నారు.

రాజకీయాల్లో చంద్రబాబును చాణక్యుడిగా పిలుస్తుంటారు. అప్పట్లో తన మామయ్య ఎన్టీఆర్ అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు పార్టీని, అధికారాన్ని తన సొంతం చేసుకున్నప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి తిరిగి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారు. కానీ, ఆ తర్వాత కాలంలో తానే తిరుగు బాటు చేసి పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈనాటికి కూడా టీడీపీలో నందమూరి వారసులకు పెద్దగా ప్రాధాన్యత దక్కకుండా చేయడంలో చంద్రబాబు చాణక్యతే ఉంది. ఇక ఏపీ విభజన తర్వాత వైఎస్ జగన్ ప్రభంజనం ఉన్నప్పటికీ.. తానో గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకుంటూ 2014 ఎన్నికల్లో గెలిచారు. ప్రతీ సారి ఏదో ఒక వ్యూహంతో ముందుకు వెళ్లి ఎన్నికలు గెలవడం చంద్రబాబుకు అలవాటు అయ్యింది. కానీ ఇటీవల అతడి వ్యూహాలు పెద్దగా పనిచేయడం లేదు.

చంద్రబాబు వ్యూహాలు పాతబడి పోయాయని.. అందుకే వ్యూహకర్త అవసరం అని కొంత మంది నేతలు అంటున్నారు. మరి కొంత మంది మాత్రం రాజకీయాల్లో వ్యూహాలు పాతబడటం ఏమీ ఉండవని.. పార్టీకి కూడా ఎవరో ఒక వ్యూహకర్త కావాలనే నియమించకున్నారని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిశోర్‌ను నియమించుకున్నారు. కానీ ఆ తర్వాత కొంత కాలానికే పీకే పాత్రను చాలా వరకు తగ్గించారు. కేవలం తెర వెనుక పని చేయడానికి, సర్వేలకే పీకే టీమ్‌ను పరిమితం చేశారు. పార్టీలో ఆయన జోక్యం లేకుండా కేసీఆర్ చూసుకున్నారు. ఇప్పుడు రాబిన్ శర్మ పరిస్థితి కూడా అలాగే మారబోతోందని జోస్యం చెబుతున్నారు. టీడీపీకి వ్యూహకర్తల అవసరం ఉండదని.. అన్నీ తానై నడిపించే చంద్రబాబుతో కలిసి పని చేయడం కూడా వారికి కష్టమేనని అంటున్నారు. కొన్నిరోజుల్లోనే రాబిన్ శర్మ తిరిగి వెళ్లిపోతాడనే చర్చ జరుగుతున్నది.

ఏపీలోని వైసీపీ, టీడీపీలు ఇప్పుడు ఇద్దరు స్ట్రాటజిస్టులతో రాజకీయం చేస్తున్నారు. ఒకవైపు పీకే టీమ్, మరోవైపు రాబిన్ శర్మ నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు. వైసీపీని మరో సారి అధికారంలోకి తీసుకొని రావడానికి పీకే టీం చాలానే కష్టపడుతున్నది. ఇక రాబిన్ శర్మ ఇప్పుడిప్పుడే టీడీపీలో దూకుడును పెంచుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీకి పొత్తు కుదరడం కష్టమే అనే సంకేతాలు రావడంతోనే రాబిన్ శర్మను చంద్రబాబు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే చివరి ఎన్నికలు అనే మాట ప్రజల్లోకి నెగిటివ్ ప్రచారాన్ని తీసుకొని వచ్చింది. అలాంటి తప్పులు సరిదిద్దడానికి రాబిన్ శర్మ పనికొస్తాడని చంద్రబాబు ఆశిస్తున్నారు. అయితే, పార్టీలో ఇతరుల జోక్యాన్ని పెద్దగా సహించని చంద్రబాబు.. రాబిన్ శర్మను ఎంతకాలం కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.

First Published:  22 Nov 2022 11:24 AM GMT
Next Story