Telugu Global
Andhra Pradesh

ఏపీలో డేంజర్ బెల్స్.. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల్లో పెరుగుతున్న హెచ్ఐవీ బాధితులు

చాలా మంది యువకులు తమకు హెచ్ఐవీ ఉన్నా.. చికిత్స తీసుకోవడం లేదు. కాలేజీల అడ్మిషన్లలో ప్రాబ్లెం వస్తుందనే కారణంతో తమకు వ్యాధి ఉన్నా.. ఆసుపత్రులకు రెగ్యులర్ చెకప్స్‌కు వెళ్లడం లేదు.

ఏపీలో డేంజర్ బెల్స్.. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల్లో పెరుగుతున్న హెచ్ఐవీ బాధితులు
X

ఒకప్పుడు హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టించింది. డబ్ల్యూహెచ్‌వో చొరవతో అన్ని దేశాల్లోని ప్రభుత్వాలు ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతో హెచ్ఐవీ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ హెచ్ఐవీ/ఎయిడ్స్‌కు పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులోకి లేకపోవడం.. కొన్ని సమూహాల్లో ఈ వైరస్ ప్రభావం చూపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. డబ్ల్యూహెచ్‌వోతో కలిసి కొన్ని ఎన్జీవోలు హెచ్ఐవీని వ్యాప్తిని అరికట్టడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. 2019 లెక్కల ప్రకారం దేశంలో హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు 23.49 లక్షల మంది ఉండగా, ఒక్క ఏపీలోనే 3.14 లక్షల మంది తేలారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏపీలోనే ఎక్కువగా ఉన్నది.

గత 12 ఏళ్లతో పోల్చుకుంటే ఏపీలో ఎయిడ్స్ బాధితులు ఈ ఏడాది తగ్గిపోయారు. 2010-11లో జనాభాలో 6.74 శాతం మందికి హెచ్ఐవీ సోకినట్లు గుర్తిస్తే.. ప్రస్తుతం వారి సంఖ్య 0.87 శాతానికి తగ్గిపోయింది. ఇక గర్భం ద్వారా సంక్రమించిన వారి సంఖ్య 0.46 శాతం నుంచి 0.05 శాతానికి తగ్గిపోయింది. ఇవన్నీ ఊరట కలిగించే విషయాలే. అయితే కొత్తగా ఒక సమూహంలో హెచ్ఐవీ బాధితులు పెరుగుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ఏపీలోని యువతలో హెచ్ఐవీ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్, డిగ్రీ విద్యార్థులతో పాటు పలు రంగాల్లో పని చేస్తున్న యువకులు హెచ్ఐవీ రిస్క్‌ను ఎదుర్కుంటున్నారు. వీరిలో చాలా మంది వారికి తెలియకుండానే తమ భాగస్వాములకు హెచ్ఐవీని వ్యాపింపజేస్తున్నారు.

హెచ్ఐవీ బారిన పడే అవకాశాలు ఉన్న యువతకు పూర్తి అవగాహన కల్పించి.. ఎవరైనా వైరస్ బారిన పడితే వారికి యాంటీరిట్రోవైరల్ థెరపీని అందించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వైరల్ లోడ్ తగ్గించే చికిత్స కూడా చేయించాలి. ఇదంతా ఏపీ సాక్స్ బాధ్యతే. కానీ ఇటీవల ఏపీ సాక్స్ ఎక్కువగా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లు, స్వలింగ సంపర్కుల పైనే ఫోకస్ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. యువకుల్లో హెచ్ఐవీ పట్ల అవగాహన కల్పించి.. వారికి వెంటనే యాంటీరిట్రోవైరల్ థెరపీని అందించకపోతే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మంది యువకులు తమకు హెచ్ఐవీ ఉన్నా.. చికిత్స తీసుకోవడం లేదు. కాలేజీల అడ్మిషన్లలో ప్రాబ్లెం వస్తుందనే కారణంతో తమకు వ్యాధి ఉన్నా.. ఆసుపత్రులకు రెగ్యులర్ చెకప్స్‌కు వెళ్లడం లేదు. పైగా కొంత మంది యువత వైరస్ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికైనా ఏపీ సాక్స్ కొత్త ప్రణాళికతో ముందుకు రావాలని, ముఖ్యంగా యువతలో హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల పూర్తి అవగాహణ కల్పించే శిబిరాలు ఏర్పాటు చేయాలని ఓ ఎన్జీవో టీమ్ లీడర్ సూచించారు.హెచ్ఐవీ ఉన్న వారికి ఇతర వ్యాధులు వస్తే వారిని ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవడానికి పలు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

First Published:  1 Dec 2022 2:01 AM GMT
Next Story