Telugu Global
Andhra Pradesh

కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్..

కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటకు కారణాలు, వాటికి కారకులు, ఏర్పాట్లలో ఏవైనా లోపాలున్నాయా..? సభల నిర్వహణలో అనుమతుల ఉల్లంఘన ఏమైనా జరిగిందా..? ఉల్లంఘిస్తే దానికి బాధ్యులెవరు..? అనే కోణంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్..
X

కందుకూరు, గుంటూరు దుర్ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి.శేష శయన రెడ్డి నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. డిసెంబర్ 28న కందుకూరులో జరిగిన బహిరంగ సభలో 8మంది చనిపోగా, జనవరి 1న గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. ఈ రెండూ టీడీపీ కార్యక్రమాలే. ఇవి చంద్రబాబు హత్యలేనంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది, కాదు దుర్ఘటనలు అంటోంది టీడీపీ. అదే సమయంలో పోలీసులు సరిగా బందోబస్తు నిర్వహించలేదని, కుట్రకోణం ఉందని కూడా టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీంతో ఓవైపు పోలీస్ ఎంక్వయిరీ జరుగుతుండగానే మరో వైపు న్యాయ విచారణకోసం కమిషన్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేకంగా జీవో-7 జారీ చేసింది. నెలరోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.

కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటకు కారణాలు, వాటికి కారకులు, ఏర్పాట్లలో ఏవైనా లోపాలున్నాయా..? సభల నిర్వహణలో అనుమతుల ఉల్లంఘన ఏమైనా జరిగిందా..? ఉల్లంఘిస్తే దానికి బాధ్యులెవరు..? అనే కోణంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా సూచించాలని చెప్పింది.

రోడ్ షో లపై పిల్..

మరోవైపు ఏపీలో రోడ్ షో లు, బహిరంగ సభలు, నిర్వహించుకోడానికి తగిన చర్యలు తీసుకునేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలైంది. పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్ ఈ పిల్ వేశారు. రోడ్ షో లు, బహిరంగ సభలను నియంత్రించే విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించడంలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని, మార్గదర్శనం చేయాలని ఆయన హైకోర్టుని కోరారు.

First Published:  8 Jan 2023 12:39 AM GMT
Next Story