Telugu Global
Andhra Pradesh

గ‌న్న‌వ‌రం.. తెలుగుదేశానికి శాపం

కోలుకుని వ‌చ్చాక బ‌చ్చుల అర్జునుడే చూసుకుంటార‌ని టిడిపి పెద్ద‌లు ఆశించారు. అయితే ఆయ‌న గుండె సంబంధిత స‌మ‌స్య తిర‌గ‌బెట్టి నెల రోజుల‌కి పైగా చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

గ‌న్న‌వ‌రం.. తెలుగుదేశానికి శాపం
X

తెలుగుదేశం పార్టీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఇన్చార్జి బ‌చ్చుల అర్జునుడు మృతితో గ‌న్న‌వ‌రంలో పార్టీ ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. తెలుగుదేశానికి పెట్ట‌ని కోట‌లాంటి గ‌న్న‌వ‌రం ఇప్పుడు శాపంగా మారింది. టిడిపి నుంచి గెలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, వైసీపీలో చేర‌కుండానే వైసీపీ నేత‌గా చెలామ‌ణి అవుతున్నారు. దాదాపు రెండేళ్ల‌కు పైగా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి స‌రైన ఇన్చార్జిని వేయ‌లేని ప‌రిస్థితుల్లో తెలుగుదేశం ఊగిస‌లాడింది.

గ‌న్న‌వ‌రం టిడిపి ఇన్చార్జిగా మేముంటాం అంటే, మేముంటాం అంటూ చాలా మంది నేత‌లు ముందుకొచ్చారు. అయితే అధిష్టానం మాత్రం గ‌ద్దె రామ్మోహ‌న్ బంధువు, పారిశ్రామిక‌వేత్త పుట్ట‌గుంట స‌తీష్‌ని మొద‌ట్లో రంగంలోకి దింపాల‌ని చూసింది. ఆయ‌న సుముఖ‌త వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ అన్వేష‌ణ ఆరంభించింది. చివ‌రికి ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడిని గ‌న్న‌వ‌రం ఇన్చార్జిగా నియ‌మించారు.

గ‌న్న‌వ‌రం టిడిపిని అర్జునుడు ముందుండి న‌డిపిస్తార‌ని అధినేత చంద్ర‌బాబు భావించారు. అయితే ఆయ‌న గుండె సంబంధిత స‌మ‌స్య‌తో మొద‌టిసారి ఆస్ప‌త్రిలో చేరాక మ‌ళ్లీ గ‌న్న‌వ‌రం టిడిపిలో గంద‌ర‌గోళం నెల‌కొంది. కోలుకుని వ‌చ్చాక బ‌చ్చుల అర్జునుడే చూసుకుంటార‌ని టిడిపి పెద్ద‌లు ఆశించారు. అయితే ఆయ‌న గుండె సంబంధిత స‌మ‌స్య తిర‌గ‌బెట్టి నెల రోజుల‌కి పైగా చికిత్స పొందుతూ క‌న్నుమూశారు.

టిడిపి ఆవిర్భావం నుంచీ ఉన్న అర్జునుడు పార్టీకి వీర‌విధేయుడు. 1995-2000 వరకు బందరుకోట పీఎసీఎస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. కేడీసీసీబీ వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. మచిలీపట్నం మునిసిపల్‌ చైర్మన్ గా (2000 -2005) పనిచేశారు. 2014 నుంచి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2017లో శాసనసభ్యుల కోటాలో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లో టీడీపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. విశేష అనుభ‌వం ఉన్న అర్జునుడు బీసీ కావ‌డం కూడా గ‌న్న‌వ‌రంలో క‌లిసి వ‌స్తుంద‌ని టిడిపి ఆశించింది. బ‌చ్చుల అర్జునుడు మృతితో టిడిపి అంచనాలన్నీ త‌ల్ల‌కిందుల‌య్యాయి.

టిడిపి టికెట్టుపై గెలిచి, వైసీపీ పంచ‌న‌చేరి తెలుగుదేశంపై విరుచుకుప‌డుతున్న వ‌ల్ల‌భ‌నేని వంశీకి చెక్ పెట్టాల‌ని టిడిపి ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. వైసీపీలో మూడు గ్రూపులున్నా వంశీని ఎదిరించేవారు వైసీపీలోనూ, టిడిపిలోనూ క‌న‌ప‌డ‌టంలేదు. పార్టీ కీల‌క‌నేత‌లు బుద్ధా వెంక‌న్న‌, ప‌ట్టాభి గ‌న్న‌వ‌రం టికెట్ ఆశిస్తున్నా అధినేత అంత‌గా ఆస‌క్తి చూప‌డంలేద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ప‌ట్టాభి గ‌న్న‌వ‌రంలో అడుగుపెట్టి కేసుల్లో ఇరుక్కున్నాడు. తెలుగుదేశం ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తీసుకున్న గ‌న్న‌వ‌రం, పార్టీ పాలిట శాపంగా మారింద‌ని నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. బ‌చ్చుల అర్జునుడు మృతితో గ‌న్న‌వ‌రం వైపు చాలా మంది టిడిపి నేత‌లు చూస్తున్నా, వ‌ల్ల‌భ‌నేని వంశీని ఎదుర్కోగ‌ల ద‌మ్మున్న నేత‌ని రంగంలోకి దింపాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నార‌ని స‌మాచారం.

First Published:  3 March 2023 2:42 AM GMT
Next Story