Telugu Global
Andhra Pradesh

ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు.. ఏపీ నాయకులు స్పందించరేం..?

కాంగ్రెస్ ప్రకటనను స్వాగతిస్తే కచ్చితంగా బీజేపీకి కోపం వస్తుంది. పోనీ కాంగ్రెస్‌కి అంత సీన్ లేదు అని విమర్శిస్తే ప్రత్యేక హోదాకు వ్యతిరేకులు అన్న ముద్రపడుతుంది. అందుకే ఏ పార్టీ కూడా స్పందించలేదు.

ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు.. ఏపీ నాయకులు స్పందించరేం..?
X

విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు పలు ఇతర వరాలు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ దిగిపోవడంతో ఏపీకి కష్టాలొచ్చాయి. ఆ హామీలను బీజేపీ నెరవేర్చాల్సిన అవసరం లేదన్నది కాషాయదళం. టీడీపీ లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీని పల్లెత్తుమాట అనలేదు, ఎన్నికలకు టైమ్ దగ్గరపడిన తర్వాత, హోదా విషయంలో మోసం చేశారనే నిందవేసి ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది టీడీపీ. 2019లో ఏపీలో ప్రభుత్వం మారినా, కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి రావడంతో పరిస్థితి మారలేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ సైలెంట్ అయ్యాయి. బీజేపీకి కావాల్సింది కూడా అదే. కానీ ఇంతలోనే మరో కీలక ప్రకటన. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని, ప్రధాని హోదాలో రాహుల్ గాంధీ.. ఆ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. కానీ ఏపీ నుంచి అనుకున్న స్థాయిలో స్పందన లేదు.

ఏపీలో జనం ఏమనుకుంటున్నారనే విషయం పక్కనపెడితే, కనీసం అధికార ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోనట్టే సైలెంట్‌గా ఉన్నాయి. ఇన్నాళ్లూ హోదా విషయంలో ఒకరిపై ఒకరు బురదజల్లుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసి బేషరతుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటోంది, తొలి సంతకం అదే ఫైల్‌పై అంటోంది. ఇంకా ఏపీ నాయకులు స్పందించకపోవడంలో ఆంతర్యమేంటి..? అయితే స్వాగతించాలి, లేదా విమర్శించాలి. కానీ విచిత్రంగా ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ సైలెంట్‌గా ఉన్నాయి.

సేఫ్ గేమ్..

ఏపీలో అధికార వైసీపీ, బీజేపీతో వైరం కోరుకోవడంలేదు. అటు ప్రతిపక్ష టీడీపీ అవకాశం వస్తే బీజేపీతో కలసి పోటీ చేయాలనుకుంటోంది. జనసేన ఎలాగూ బీజేపీ చంకలోనే ఉంది. అందుకే ఎవరూ ఈ విషయంలో స్పందించలేదు. కాంగ్రెస్ ప్రకటనను స్వాగతిస్తే కచ్చితంగా బీజేపీకి కోపం వస్తుంది. పోనీ కాంగ్రెస్‌కి అంత సీన్ లేదు అని విమర్శిస్తే ప్రత్యేక హోదాకు వ్యతిరేకులు అన్న ముద్రపడుతుంది. అందుకే ఏ పార్టీ కూడా స్పందించలేదు. ఒకరకంగా తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్‌గా ఉన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే దానికి కేవలం కేంద్రం దయాదాక్షిణ్యాలే కారణం అనుకోవాలి. ఏపీలోని ప్రభుత్వం కొట్లాడి తేవడం, మెడలు వంచడం, నడుములు విరగ్గొట్టడం.. లాంటివేవీ జరగవు. ఆ దయా దాక్షిణ్యాలను కూడా తమ క్రెడిట్‌గా చెప్పుకోడానికే ఏపీ పార్టీలు రెడీగా ఉంటాయి. అందుకే కాంగ్రెస్ ప్రకటనపై ఆచితూచి స్పందించేందుకు, లాభనష్టాలు బేరీజు వేసుకుని మాట్లాడేందుకు నాయకులు ఆలోచిస్తున్నారు.

First Published:  4 Oct 2022 12:45 PM GMT
Next Story