Telugu Global
Andhra Pradesh

టీడీపీకి ఎందుకు ఓట్లేయాలి?

అడుగడుగునా రాయ‌ల‌సీమపై వ్యతిరేకత చూపుతున్న‌ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి ఎందుకు ఓట్లేయాలని జనాలు అడిగితే లోకేష్ ఏం సమాధానం చెబుతారు?

టీడీపీకి ఎందుకు ఓట్లేయాలి?
X

ఇప్పుడు ఇదే సందేహం రాయలసీమ జనాల్లో మొదలైంది. దాదాపు 125 రోజులు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. కుప్పంలో మొదలుపెట్టిన పాదయాత్ర కడప జిల్లాను దాటుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర చేసిన‌ప్పుడు చెప్పని మాటలను కడప జిల్లా పర్యటనలోనే చెప్పారు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కాబట్టే. ఈ జిల్లాలోనే రాయలసీమ డిక్లరేషన్ అంటూ చాలా పెద్ద పెద్ద హామీలిచ్చేశారు. అవన్నీ ఎంతవరకు నెరవేరుస్తారనే విషయంలో జనాలకు మంచి క్లారిటినే ఉంది.

అయితే చివర్లో లోకేష్ జనాలకు ఒక ప్రశ్నవేశారు. అదేమిటంటే వైసీపీకి 2019 ఎన్నికల్లో 49 సీట్లిచ్చినపుడు తమకు కూడా ఎందుకివ్వరు? అని. వైసీపీకి ఇచ్చినన్ని సీట్లు తమకు కూడా ఇస్తే సీమసత్తా ఏమిటో దేశానికి చూపిస్తానని గొప్పలు చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే లోకేష్ మాటలు నమ్మేసి టీడీపీకి ఓట్లు వేసే జ‌నాలు ఎవరు లేరు. తమకు మెజారిటి సీట్లు ఎందుకు ఇవ్వరని లోకేష్ అడగటమే విచిత్రంగా ఉంది.

టీడీపీకి మెజారిటి సీట్లు ఎందుకు ఇవ్వరని అడిగేముందు ఎందుకు ఇవ్వాలని? ఎందుకు ఇవ్వటంలేదని తనను తాను లోకేష్ ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది. పుట్టి పెరిగింది, ప్రతినిధ్యం వహిస్తున్నది రాయలసీమ నుండే అయినా చంద్రబాబునాయుడు ఏరోజూ తాను సీమవాసిగా వ్యవహరించలేదు. పైగా రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే రాయలసీమ గుండాలు, రాయలసీమ రౌడీలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. అవకాశం దొరికినా దొరక్కపోయినా రాయలసీమను చంద్రబాబు పదేపదే అవమానించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి కూడా ఏమీ చేయలేదు. చివరకు విభజన చట్టంలో అనంత‌పురానికి కేటాయించిన ఎయిమ్స్ ను కూడా మంగళగిరికి తీసుకెళ్ళారు. పద్మావతి మెడికల్ కాలేజీ సీట్లలో రాయలసీమ విద్యార్థులకు కోటా ఉంది. ఆ కోటాను కూడా ఎత్తేసి రాష్ట్రమంతా వర్తించేట్లు సవరణలు చేశారు. మొత్తంమీద తాను రాయలసీమ వాసిగా కన్నా కోస్తా నేతగా ఐడెంటిఫై అవటానికే చంద్రబాబు ఇష్టపడినట్లు అర్థ‌మవుతోంది.

అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సీమకు సాగునీటి కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని తెలంగాణ నేతలు వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించారంటే అర్థ‌ముంది. కానీ వాళ్ళతో చంద్రబాబు కూడా చేతులు కలిపారు. సీమ కోసం వైఎస్సార్ ఏమిచేద్దామని ప్రయత్నించినా చంద్రబాబు అడ్డుకున్నారు.

ఇక జగన్మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు పెడతానంటే వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడు పాదయాత్రలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ అని లోకేష్ హామీ ఇచ్చారు. ఎవరైనా హైకోర్టు కోరుకుంటారా లేకపోతే బెంచ్ మాత్రమే కోరుకుంటారా అన్న ఇంగితం కూడా లోకేష్‌కు లేకపోయింది. అడుగడుగునా రాయ‌ల‌సీమపై వ్యతిరేకత చూపుతున్న‌ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి ఎందుకు ఓట్లేయాలని జనాలు అడిగితే లోకేష్ ఏం సమాధానం చెబుతారు?

First Published:  15 Jun 2023 6:28 AM GMT
Next Story