Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు వస్తే ఆరోగ్యశ్రీకి చెల్లు చీటీ.. ధ్రువీకరించిన రామోజీరావు

ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. పేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను ప్రవేశపెట్టారు.

చంద్రబాబు వస్తే ఆరోగ్యశ్రీకి చెల్లు చీటీ.. ధ్రువీకరించిన రామోజీరావు
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీకి చెల్లు చీటి పాడినట్లే. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాను వర్తింపజేస్తామని చంద్రబాబు నాయుడు కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినప్పుడే ఆయన అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ఉండదని అర్థమైంది. ఆ విషయాన్ని ఈనాడు రామోజీరావు ధ్రువీకరించారు.

ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ అమలుపై ఆయన అబద్ధాన్ని అచ్చేశారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పూర్తి స్థాయిలో వైద్య అవసరాలు తీర్చలేకపోతున్నాయని, ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక ప్రైవేట్ ఆస్పత్రులు ఉచిత వైద్యానికి నిరాకరిస్తున్నాయని ఆయన ఈనాడులో రాయించారు. ఆరోగ్యశ్రీ పథకం సరైంది కాదని మాత్రం ఆయన అనలేదు. ఆరోగ్యశ్రీ పథకం మంచిదనే అభిప్రాయంతోనే ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.

ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. పేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను ప్రవేశపెట్టారు. త‌న తండ్రి ప్ర‌వేశ‌పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప‌క‌డ్బందీగా అమలు చేస్తూ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఏపీకి చెందిన ఆరోగ్య‌శ్రీ ల‌బ్ధిదారులు బెంగళూర్, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రయోజనం పొందే విధంగా జగన్ ఏర్పాట్లు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరు పట్ల పేద ప్రజలు చాలా సానుకూల వైఖరితో ఉన్నారు.

కూట‌మి అధికారంలోకి వస్తే చంద్రబాబు దాన్ని తీసేయడానికి నడుం బిగించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాతో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మెరుగైన ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని చంద్రబాబు కల్పిస్తున్నారని ఈనాడు ప్రశంసించింది. ఈనాడు అంతకన్నా ఏం రాయగలదు? కానీ, ఆస్పత్రుల్లో చేరిన తర్వాత బీమా సంస్థలు ఆర్థిక సాయం అందించడానికి ఎన్ని మెలికలు పెడుతున్నాయో ప్రజలకు అనుభవంలో ఉన్నదే. అందువల్ల ఆరోగ్యశ్రీ కన్నా అది ఎంత మాత్రం సులభతరమైంది, మేలైంది కాదని ఘంటాపథంగా చెప్పవచ్చు.

First Published:  1 May 2024 6:40 AM GMT
Next Story