Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు వస్తే నిజంగానే శ్రీలంక అవుతుందేమో?

జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ శ్రీలంకలాగ అయిపోతోందని ఒకపుడు ఇదే చంద్రబాబు నానా గోల చేశారు. అయితే ఆ గోల సంగతి ఏమిటో కానీ చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం ఏపీ నిజంగానే శ్రీలంక అయిపోతుందేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

చంద్రబాబు వస్తే నిజంగానే శ్రీలంక అవుతుందేమో?
X

అధికారం అందుకునే విషయంలో చంద్రబాబునాయుడులో కసి పెరిగిపోతోంది. ఏమిచేసయినా సరే 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిందే అని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఓడిపోతే ఏమి జరుగుతుందో అందరికన్నా చంద్రబాబుకే ఎక్కువగా తెలుసు. అధికారంలోకి రావటమే టార్గెట్‌గా అందుబాటులో ఉన్న అన్నీ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఈ అస్త్రాల్లో ప్రధానమైనది ఉచితాలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే నాలుగో సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.

ఇప్పటికే మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు అదనంగా నాలుగో సిలిండర్‌ను చేర్చారు. చంద్రబాబు వైఖరి ఎలాగుందంటే హామీలను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే గెలిపిస్తారు లేకపోతే జనాల ఖర్మ అన్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ శ్రీలంకలాగ అయిపోతోందని ఒకపుడు ఇదే చంద్రబాబు నానా గోల చేశారు. అయితే ఆ గోల సంగతి ఏమిటో కానీ చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం ఏపీ నిజంగానే శ్రీలంక అయిపోతుందేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే తల్లికి వందనం స్కీంలో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తలా రూ.15 వేలు ఇస్తారట ఏడాదికి. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తారట. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలన్నారు. ఉచితాలు.. ఉచితాలంటు జనాలను ఒకటే ఊదరగొడుతున్నారు. ఇలాంటి హామీలే 2014 ఎన్నికల్లో కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో అందరు చూసిందే. అలాంటిది మళ్ళీ అదే ఉచితాల బాట ఎందుకు పడుతున్నారంటే తన హామీలను జనాలు నమ్మటంలేదనే అనుమానాలు వచ్చినట్లున్నాయి. అందుకనే ఉచితాలను పెంచుతున్నారు. 3 సిలిండర్లను నాలుగు చేశారు. అలాగే 15 వేల రూపాయలను 20 వేలు చేస్తారేమో. నెలకు ఇస్తానని చెప్పిన 1500 రూపాయలను రూ. 2 వేలు చేస్తారేమో. రైతులకు ఇస్తానని చెప్పిన రూ.20 వేలను రూ.30 వేలు చేస్తారనే అనుమానాలున్నాయి. చంద్రబాబును నమ్మి జనాలు ఓట్లేసి అధికారమిస్తే, హామీలను అమల్లోకి తీసుకొస్తే అప్పుడు ఏపీ నిజంగానే శ్రీలంక అవుతుందేమో.


First Published:  31 Aug 2023 5:49 AM GMT
Next Story