Telugu Global
Andhra Pradesh

ఇదేమి ఖర్మ: టీడీపీ స్లోగన్.. వైసీపీ హైజాక్

నిన్న కందుకూరులో 8 మంది మృతి, నేడు గుంటూరులో ఇప్పటికి ముగ్గురు మృతి, ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి ! అంటూ ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు.

ఇదేమి ఖర్మ: టీడీపీ స్లోగన్.. వైసీపీ హైజాక్
X

టీడీపీ స్లోగన్ ని వైసీపీ హైజాక్ చేసింది. ఇదేమి ఖర్మ అంటూ ఇప్పటి వరకూ టీడీపీ అందుకున్న నినాదాన్ని వైసీపీ నాయకులు రిపీట్ చేస్తున్నారు. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటున్నారు. టీడీపీ కంటే వైసీపీ నేతలే ఇప్పుడు ఎక్కువగా ఇదేమి ఖర్మ అనేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదేమి ఖర్మ అంటూ ట్వీట్ చేశారు.

నిన్న కందుకూరులో 8 మంది మృతి

నేడు గుంటూరులో ఇప్పటికి ముగ్గురు మృతి

ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి ! అంటూ ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా ముగ్గురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు కూడా కారణం చంద్రబాబేనంటూ మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ చంద్రబాబుని టార్గెట్ చేశాయి.


బాదుడే బాదుడు సరిపోవట్లేదని టీడీపీ మొదలు పెట్టిన కొత్త కార్యక్రమం ఇదేమి ఖర్మ రాష్ట్రానికి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లు ఇచ్చిన సలహాతో చంద్రబాబు ఈ కార్యక్రమం మొదలు పెట్టి, ఇదేమి ఖర్మ అంటూ రాష్ట్ర పర్యటన మొదలు పెట్టారు. అయితే కందుకూరులో ఈ యాత్ర 8మంది మృత్యువాతకు పరోక్ష కారణంగా నిలిచింది. బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది చనిపోయారు. బాధితులకు టీడీపీ నష్టపరిహారం ప్రకటించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిహారం అందించడం తెలిసిందే. ఎవరెంత పరిహారం ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ ఆ దుర్ఘటన తర్వాత టీడీపీ, వైసీపీ మధ్య మాటలు ఓ రేంజ్ లో పేలాయి. ఇరుకు సందుల్లో జనాల్ని పోగు చేసి, డ్రోన్ షాట్లకోసం వారందర్నీ ఒకే దగ్గరకు తెచ్చి పరోక్షంగా చంద్రబాబే తన ప్రచార యావతో వారిని చంపేశారని వైసీపీ విమర్శించింది. వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్షగట్టి, పోలీసు బందోబస్తు లేకుండా చేయడంతోనే దుర్ఘటన జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు గుంటూరులో జరిగిన దుర్ఘటన ముగ్గురి మృతికి కారణం కావడం మాత్రం మరింత విషాదకరం.

ఇక్కడ కూడా చంద్రబాబు సభే సమస్యకు అసలు కారణం. చంద్రబాబు వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగిందని టీడీపీ అనుకూల మీడియా కవర్ చేసుకోవాలని చూసినా, చంద్రబాబు ఉన్నా లేకున్నా.. సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత, జనం భారీగా వస్తారనుకున్నప్పుడు కాస్త పద్ధతిగా కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత టీడీపీ నేతలపై ఉంది. కానీ అక్కడ జనాల్ని అదుపు చేయలేకపోయారు టీడీపీ నేతలు. ఫలితంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైసీపీ మళ్లీ చంద్రబాబుని టార్గెట్ చేసింది. ఇదేమి ఖర్మ అంటూ చంద్రబాబుపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు యాత్రలతో రాష్ట్రానికి ఖర్మ పట్టిందని అంటున్నారు.

First Published:  1 Jan 2023 4:59 PM GMT
Next Story