Telugu Global
Andhra Pradesh

మా లక్ష్యం అదే.. ICID కాంగ్రెస్ ప్లీనరీలో జగన్

రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు సంభవిస్తోందని, దీనికి కారణం వర్షాభావ పరిస్థితులేనని చెప్పారు సీఎం జగన్. వర్షం కురిసేది తక్కువ కాలమే అయినా.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.

మా లక్ష్యం అదే.. ICID కాంగ్రెస్ ప్లీనరీలో జగన్
X

మా లక్ష్యం అదే.. ICID కాంగ్రెస్ ప్లీనరీలో జగన్

విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ICID) కాంగ్రెస్‌ ప్లీనరీ ప్రారంభమైంది. ఈనెల 8వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ సహా.. దేశ విదేశాలకు చెందిన 1200మంది ప్రతినిధులు ఈ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏపీలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందని, ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారాయన.

వర్షం తక్కువ, వినియోగం ఎక్కువ..

రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు సంభవిస్తోందని, దీనికి కారణం వర్షాభావ పరిస్థితులేనని చెప్పారు సీఎం జగన్. వర్షం కురిసేది తక్కువ కాలమే అయినా.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. నీటిని ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కు తరలించే వ్యవస్థలు ఏర్పాటు కావాలన్నారు. అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. దిగువ నదీ తీర రాష్ట్రంగా నీటి నిర్వహణ కోసం ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు సీఎం జగన్. వంశధార, నాగావళి, కృష్ణ, గోదావరి నదులు ఉన్నా అతివృష్టి, అనావృష్టి వల్ల నీటి నిర్వహణ పెద్ద సవాల్ గా మారిందన్నారు.

షెకావత్ ఏమన్నారంటే..?

ప్రతీ నీటి బొట్టును తిరిగి వినియోగించేలా సమర్థ మెకానిజం జరగాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌. ఇప్పటికీ భారత్ లో 65 శాతం వ్యవసాయం భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉందన్నారు. భూగర్భ జలాల నిర్వహణ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిల్వల నిర్వహణ జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపడుతోందని, రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్‌ తరాలను ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారాయన. వాటర్‌ రీసైక్లింగ్‌ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నామని, తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నామని వివరించారు గజేంద్ర షెకావత్.

First Published:  2 Nov 2023 7:57 AM GMT
Next Story