Telugu Global
Andhra Pradesh

వచ్చే ఎన్నికల బరిలో ఐఏఎస్, ఐపీఎస్‌లు

రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ కొండపి నుంచి పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ ప్రయత్నిస్తున్నారట. రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు వైసీపీ టికెట్ ఆశిస్తున్నారట.

వచ్చే ఎన్నికల బరిలో ఐఏఎస్, ఐపీఎస్‌లు
X

ఏపీలో చాలా మంది అధికారులు ఎన్నికల బరిలో దిగడానికి ఉవ్విళ్లూరుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. రిటైర్డ్ అయిన వాళ్లు గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టిడిపి హయాంలో పంచాయతీరాజ్ కమిషనర్ గా పనిచేసిన రామాంజనేయులు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ వైసీపీ నుంచి హిందూపురం ఎంపీగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంలో పనిచేసిన, చేస్తున్న కీలక అధికారులు ఎన్నికల బరిలో నిలవనున్నారని వార్తలు వస్తున్నాయి.

రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ కొండపి నుంచి పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ ప్రయత్నిస్తున్నారట. రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు వైసీపీ టికెట్ ఆశిస్తున్నారట. సీఐడీ డిజి సునీల్ కుమార్ కూడా ఇప్పటికే అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ పొలిటికల్ ఎంట్రీకి దారులు వేసుకుంటున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త ఇన్ కం ట్యాక్స్ ఉన్నతాధికారి దయాసాగర్ టిడిపి, జనసేనలతో మంతనాలు సాగిస్తున్నారని.. ఏదో ఒక పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ అక్కడి నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు. పలాస టిడిపి టికెట్ పై తాను పోటీచేస్తానంటూ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో జాయింట్ కమిషనర్ గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న జుత్తు తాతారావు ప్రకటించి కలకలం రేపారు. వైసీపీ సర్కారు సస్పెండ్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఏబీవీ వెంకటేశ్వరరావు గన్నవరం టిడిపి టికెట్ పై పోటీ చేయొచ్చని రూమర్లు వస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడేసరికి ఇంకెంతమంది అధికారులు పోటీకి దిగుతారో వేచి చూడాలి.

First Published:  9 Dec 2022 10:00 AM GMT
Next Story