Telugu Global
Andhra Pradesh

పదమూడేళ్లుగా భార్యను ఇంట్లోనే బంధించిన భర్త..

బయటకు తీసుకెళ్లేవాడు కాదు, ఆమెను ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. అలాగని హింసించేవాడు కూడా కాదు. ఈ శాడిజం తట్టుకోలేక సుప్రియ అల్లాడిపోయేది.

పదమూడేళ్లుగా భార్యను ఇంట్లోనే బంధించిన భర్త..
X

ఇదో విచిత్రమైన క్రైమ్ స్టోరీ. అత్తవారింటిపై కోపంతో భార్యను చిత్రహింసకు గురి చేశాడు ఓ భర్త. తిట్టలేదు, కొట్టలేదు, కానీ భార్యను ఇల్లు దాటి బయటకు కాలు పెట్టనీయలేదు. అత్తమామలపై కోపం ఒక్కటే కాదు, ఇది పూర్తిగా శాడిజం అని అంటున్నారు చుట్టుపక్కలవాళ్లు. అతను లాయర్ కావడంతో ఇరుగు పొరుగు కూడా అంత ధైర్యంగా అడిగే సాహసం చేయలేదు. ఎట్టకేలకు పోలీసుల చొరవతో ఆ భార్య 13 ఏళ్ల చెరకు విముక్తి కలిగింది.

ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో జరగలేదు. ఏపీలోని విజయనగరం పట్టణంలో జరిగిన యదార్థ ఘటన. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన లాయర్ మధుబాబుకి 2008లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సాయుసుప్రియతో వివాహం అయింది. మరుసటి ఏడాది పురుడుకోసం సుప్రియ తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. పాప పుట్టింది. మనవరాలితో సహా కూతురిని తీసుకొచ్చి విజయనగరంలో వదిలిపెట్టి వెళ్లారు సుప్రియ తల్లిదండ్రులు జనార్దన్ హేమలత.


ఆ తర్వాత మధుబాబుకి ఏమైందో ఏమో కానీ సుప్రియకు ఆమె పుట్టింటివారితో బంధాన్ని తెంచేశాడు. ఫోన్లో మాట్లాడనిచ్చేవాడు కాదు, కనీసం ఆమె ఎలా ఉందనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకునే అవకాశమే లేదు. ఆ తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టినా సుప్రియ కేవలం ఆస్పత్రికి తిరిగి ఇంటికి అన్నట్టుగానే ఉండేది. బయటకు తీసుకెళ్లేవాడు కాదు, ఆమెను ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. అలాగని హింసించేవాడు కూడా కాదు. ఈ శాడిజం తట్టుకోలేక సుప్రియ అల్లాడిపోయేది.

ఇటీవల సుప్రియ తండ్రి జనార్దన్, కుమార్తెపై దిగులు ఎక్కువై మంచం పట్టడంతో సుప్రియ తల్లి హేమలత పోలీసులను ఆశ్రయించారు. కోర్టు అనుమతితో పోలీసులు మధుబాబు ఇంటికి వెళ్లి సుప్రియకు విముక్తి కలిగించారు. 13 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కళ్లారా చూసుకున్న సుప్రియ తల్లడిల్లిపోయింది. న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో వారి కుటుంబ సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు పోలీసులు.

First Published:  2 March 2023 1:11 AM GMT
Next Story