Telugu Global
Andhra Pradesh

బెండపూడి విద్యార్థులపై అది తప్పుడు కథనం

ఈ కథనాన్ని ఉషాకుమారి ఖండించారు. పూర్తి సత్యదూరమైన కథనాన్ని ప్రచురించారని ఆమె మండిపడ్డారు. తాను అడిగిన ప్రశ్నలకు బెండపూడి విద్యార్థులు చక్కగా సమాధానం చెప్పారని ఆమె వివరించారు.

బెండపూడి విద్యార్థులపై అది తప్పుడు కథనం
X

కాకినాడ జిల్లా బెండపూడి విద్యార్థుల ఇంగ్లీష్‌పై ఒక పత్రిక ప్రచురించిన కథనం వివాదాస్పదం అయింది. బెండపూడి బడాయే అంటూ అక్కడి పిల్లలకు వచ్చేది సహజమైన ఇంగ్లీష్ కాదని.. కొన్ని మాటలను బట్టీ కొట్టించారని.. ఆ విషయం మానవ వనరుల అభివృద్ధి విభాగం కార్యదర్శి ఉషాకుమారి పర్యటనలో బయటపడిందని రాసింది. కేవలం బట్టి పట్టించిన అంశాలపై మినహా మిగిలిన వాటికి వారు ఇంగ్లీష్‌లో స్పందించలేకపోతున్నారని ఆమె గుర్తించారని ఆ పత్రిక వెల్లడించింది.

బట్టీ కొట్టిన వ్యాఖ్యలను గలగలచెప్పేస్తున్నారని.. అప్పటికప్పుడు ఇతర అంశాలపై ప్రశ్నలు వేస్తే వాటికి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారని.. దాంతో ఉపాధ్యాయుడు ప్రసాద్‌పై ఉషాకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారని.. బట్టీ పట్టిస్తూ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారని ఆ పత్రిక రాసింది.

ఈ కథనాన్ని ఉషాకుమారి ఖండించారు. పూర్తి సత్యదూరమైన కథనాన్ని ప్రచురించారని ఆమె మండిపడ్డారు. తాను అడిగిన ప్రశ్నలకు బెండపూడి విద్యార్థులు చక్కగా సమాధానం చెప్పారని ఆమె వివరించారు. ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను తాను మందలించినట్టు వచ్చిన వార్తను ఆమె ఖండించారు. పిల్లల విషయంలో పత్రిక ఇలాంటి అవాస్తవాలు రాయడం బాధాకరమన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల మారుమూల గ్రామాల్లోనూ విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియం నేర్చుకుంటున్నారని.. పిల్లలు ఇంగ్లీష్‌లో చూపుతున్న ప్రతిభను చూసి తాను సంతోషిస్తున్నానని ఒక ప్రకటన విడుదల చేశారు.

First Published:  25 Feb 2023 2:14 AM GMT
Next Story