Telugu Global
Andhra Pradesh

బాలకృష్ణను మళ్లీ గెలిపించే పనిలో హిందూపురం వైసీపీ నేతలు

తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ సీఐ ప్రచారం చేస్తున్నారని.. ఆయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సీఐకి చేతనైతే ఎవరి దగ్గరైతే మోచేతి నీళ్లు తాగుతున్నారో వారి వద్దకే వెళ్లి నియోజకవర్గంలో గొడవలు వద్దని చెప్పాలని సూచించారు.

బాలకృష్ణను మళ్లీ గెలిపించే పనిలో హిందూపురం వైసీపీ నేతలు
X

హిందూపురం వైసీపీలో వర్గవిభేదాలు ఇప్పట్లో సమిసేలా కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై వైసీపీలోని ఇతర వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. పోలీసులు కూడా ఇక్బాల్‌కు వంతపాడుతూ వైసీపీలోని ఎమ్మెల్సీ వ్యతిరేక వర్గంపై కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా స్థానిక సీఐపై ఏపీ ఆగ్రోస్‌ చైర్మన్ నవీన్‌ నిశ్చల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ ఇస్మాయిల్‌కు అంత మోజుగా ఉంటే ఖాకీ చొక్కా విప్పేసి రాజకీయాల్లోకి రావాలని సవాల్ చేశారు. జగన్‌ పుట్టిన రోజు కార్యక్రమం నిర్వహించకుండా తమకు సీఐ అడ్డంకులు సృష్టిస్తున్నారని నవీన్ నిశ్చల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ''రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఖాకీ చొక్కా విప్పేసి రా.. పోలీసుగా ఉండాలంటే నిబద్దతతో పనిచేయ్. రాజకీయ నాయకులంటే చులకనగా ఉందేమో.. ఎవరి మెప్పు కోసమో చిల్లర పనులు చేయవద్దు'' అని సీఐను హెచ్చరించారు.

తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ సీఐ ప్రచారం చేస్తున్నారని.. ఆయనకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సీఐకి చేతనైతే ఎవరి దగ్గరైతే మోచేతి నీళ్లు తాగుతున్నారో వారి వద్దకే వెళ్లి నియోజకవర్గంలో గొడవలు వద్దని చెప్పాలని సూచించారు. నవీన్ నిశ్చల్‌ తనపై చేసిన ఆరోపణలకు సీఐ ఇస్మాయిల్ స్పందించారు. వైసీపీలోని మూడు వర్గాలు 200 మీటర్ల పరిధిలోనే జగన్‌ జన్మదిన వేడుకల కార్యక్రమాలు పెట్టుకున్నాయని.. శాంతిభద్రతల సమస్య వస్తుందనే దూరం దూరంగా ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే తాను సూచించానని సీఐ చెబుతున్నారు.

నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ రామకృష్ణారెడ్డి హత్య కేసులోనూ హంతకులకు పోలీసులు సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి. పోలీసులంతా ఇక్బాల్‌ కనుసన్నల్లోనే పనిచేస్తూ.. వైసీపీలోని ఇతర వర్గాలను అణచివేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో వైసీపీ మూడు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో.. ఈసారి కూడా హిందూపురంలో వైసీపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ పోలీస్ బాస్‌ ఇక్బాల్‌ ఇతరులను కలుపుకుపోవడంలో చొరవ చూపడం లేదన్న అసంతృప్తి వైసీపీలో ఉంది.

First Published:  22 Dec 2022 2:38 AM GMT
Next Story