Telugu Global
Andhra Pradesh

మగాళ్లు ఏడుస్తారు, ఆడవాళ్లు తొడగొడతారు..

తొడగొట్టిన ఆ మహిళను అడ్డుపెట్టుకుని మరోసారి చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి రోజా. ఆ పార్టీలో మహిళలు తొడగొడతారని, మగాళ్లు ఏడుస్తారంటూ పరోక్షంగా చంద్రబాబు ఏడుపుని ప్రస్తావించారు.

మగాళ్లు ఏడుస్తారు, ఆడవాళ్లు తొడగొడతారు..
X

అమరావతి యాత్రలో మహిళా రైతు కారు ఎక్కి తొడగొట్టిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు పడుతున్నాయి. సదరు మహిళా రైతు పుట్టు పూర్వోత్తరాలు వెలికితీసి మరీ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ చేస్తోంది. ఈ క్రమంలో తొడగొట్టిన ఆ మహిళను అడ్డుపెట్టుకుని మరోసారి చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి రోజా. ఆ పార్టీలో మహిళలు తొడగొడతారని, మగాళ్లు ఏడుస్తారంటూ పరోక్షంగా చంద్రబాబు ఏడుపుని ప్రస్తావించారు. టీడీపీ జంబలకిడి పంబ పార్టీలా మారిందని అన్నారు రోజా.

ఐఫోన్లు, వాకీటాకీలు ఎందుకు..

పాదయాత్రలో పాల్గొంటున్న మహిళా రైతుల వద్ద ఐఫోన్లు, వాకీటాకీలు కనపడుతున్నాయని, అసలు పాదయాత్రలో పాల్గొంటున్నవారికి ఇవన్నీ ఎందుకని మండిపడ్డారు మంత్రి రోజా. ఐఫోన్లు వాడే వారు పేద రైతులు ఎందుకవుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే చంద్రబాబు ఈ యాత్ర చేయిస్తున్నారని అన్నారు రోజా.

దుష్టచతుష్టయం..

ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నిజాయితీగా నెరవేరుస్తుంటే దుష్ట చతుష్టయం విషం చిమ్ముతోందని మండిపడ్డారు రోజా. ఇప్పటికైనా టీడీపీ నీచరాజకీయాలు మాని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు చంద్రబాబుకు, లోకేష్ కు వత్తాసు పలుకుతున్నాయని చెప్పారు. జగన్ ను ఇంటికి పంపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని పగటి కలలు కంటున్నారని అన్నారు. వారి కలలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలంటే అక్కచెల్లెమ్మలు కొట్టే దెబ్బ టీడీపీ అబ్బా అనేలా ఉండాలన్నారు. ఈసారి అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీదే విజయం అంటున్న రోజా, కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతారని జోస్యం చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నెగ్గేదిలేదు, జగనన్న తగ్గేదిలేదని పంచ్ డైలాగులు విసిరారు రోజా. 30 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది మూడేళ్లలో జగన్‌ చేసి చూపించి దేశంలోనే బెస్ట్‌ సీఎంగా నిలిచారన్నారామె. 29 గ్రామాల కోసం 26 జిల్లాలకు అన్యాయం చేస్తామంటే ఎవరూ ఒప్పుకోరని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు రోజా.

First Published:  27 Sep 2022 8:00 AM GMT
Next Story