Telugu Global
Andhra Pradesh

కుప్పంలో టెన్షన్ టెన్షన్

పార్టీల రోడ్డు షోలు, సభలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన మరుసటిరోజే చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుండటమే టెన్షన్‌కు కారణమైంది.

కుప్పంలో టెన్షన్ టెన్షన్
X

కుప్పం జనాల్లో టెన్షన్ మొదలైంది. దీనికి కారణం ఏమిటంటే మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం కుప్పంలో అడుగు పెడుతుండటమే. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు హైదరాబాద్‌లో బయలుదేరి బెంగుళూరు మీదుగా కుప్పానికి చేరుకుంటారు. కుప్పానికి ఎప్పుడు చేరుకున్నా చంద్రబాబు ఇలాగే వెళతారు. ఇప్పుడు అది కాదు సమస్య. సమస్యేమిటంటే మూడు రోజుల పర్యటనలో చంద్రబాబు రోడ్డు షోలు, ర్యాలీలు, సభలు పెట్టుకోవటమే.

పార్టీల రోడ్డు షోలు, సభలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తమను నియంత్రించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నదని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తామని ఏమి చేసుకుంటారో చేసుకోండన్నట్లుగా చాలెంజ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన మరుసటిరోజే చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుండటమే టెన్షన్‌కు కారణమైంది.

శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో రోడ్డు షోలు, ర్యాలీలు, సభలను నిర్వహిస్తానని తనను ఎవరు ఆపుతారో చూస్తానంటూ చంద్రబాబు చాలెంజ్ చేశారు. చంద్రబాబు కార్యక్రమాలకు అనుమతి లేదు కాబట్టి ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంద‌ని పోలీసులు ఇప్ప‌టికే చంద్రబాబు పీఏ మనోహర్‌కు నోటీసులిచ్చారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు అండ్ కోకు పోలీసులకు ఘర్షణ తప్పేట్లులేదు. అదే జరిగితే పోలీసులు వెంటనే చంద్రబాబును అదుపులోకి తీసుకుంటారు. తర్వాత అరెస్టే చేస్తారా? లేకపోతే బలవంతంగా బెంగుళూరుకు తరలిస్తారా అన్నది సస్పెన్సుగా మారింది. ఏది జరిగినా పెద్ద ఎత్తున గొడవలు జరగటం ఖాయం.

కుప్పం ఘటన ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయటానికి తమ్ముళ్ళు రెడీగా ఉన్నారు. తమ్ముళ్ళ మాటలు, వార్నింగులతో ఈ విషయం అర్ధమైపోతోంది. ఇక తమ్ముళ్ళు రోడ్లపైకి వస్తే వీళ్ళకు మద్దతుగా పవన్ అండ్ కో కూడా తోడవ్వటం ఖాయమన్నట్లే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో టీడీపీ+జనసేన కలిస్తే రాష్ట్రం అట్టుడికిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. మరి దీన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వం ఎంతవరకు సన్నద్ధంగా ఉందో చూడాల్సిందే.

First Published:  4 Jan 2023 6:48 AM GMT
Next Story