Telugu Global
Andhra Pradesh

అలాంటివారిపై క‌రుణ చూపాల్సిన అవ‌స‌రం లేదు - ఏపీ హైకోర్టు

అలాంటివారిపై క‌రుణ చూపాల్సిన అవ‌స‌రం లేదు  - ఏపీ హైకోర్టు
X

లైంగిక వేధింపుల వ్య‌వ‌హారాల్లో ఉద్యోగుల‌పై క‌రుణ చూపాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. స‌హ‌చ‌ర ఉద్యోగిని ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగేలా లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన పోలీస్ శాఖ జూనియ‌ర్ అసిస్టెంట్‌ను స‌ర్వీసు నుంచి తొల‌గిస్తూ ఏపీఏటీ తీర్పు చెప్పింది. దీనిని స‌వాల్ చేస్తూ తన‌పై తీవ్ర శిక్షి విధించారంటూ జూనియ‌ర్ అసిస్టెంట్ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా, అత‌ని వాద‌న‌ను ఉన్న‌త న్యాయ‌స్థానం తోసిపుచ్చింది. అభియోగం నిరూపణ కావడంతో సర్వీసు నుంచి తొలగించారని గుర్తుచేస్తూ.. ఇలాంటి వ్యవహారాల్లో కరుణ చూపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

హుందాగా పనిచేసే హక్కు ప్రధాన `మానవ హక్కు`

హుందాగా పనిచేసే హక్కు ప్రధాన 'మానవ హక్కు' అని ధ‌ర్మాస‌నం ఈ సంద‌ర్భంగా పేర్కొంది. సురక్షితమైన ప్రదేశంలో ఏ ఉద్యోగం, వృత్తి, వర్తకాన్ని చేపట్టేందుకైనా మహిళకు ప్రాథమిక హక్కుందని తెలిపింది. జీవించే హక్కు అంటే అర్థం హుందాగా జీవించడమని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో సి. గోవిందరాజులు 1994 ఆగస్టు 17న జూనియర్ అసిస్టెంట్‌గా నియమితుడ‌య్యారు. 2013 మే 10న ఓ మహిళా జూనియర్ అసిస్టెంట్‌తో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడ‌న్న ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం అత‌న్ని సర్వీసు నుంచి తొలగిస్తూ 2013 డిసెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేశారు. వాటిపై గోవిందరాజులు అప్పీలును ఏపీఎస్పీ డీఐజీ 2014 ఆగస్టు 25న తిరస్కరించారు. సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ గోవిందరాజులు ఏపీఏటీని ఆశ్రయించగా, 2017 సెప్టెంబరు 15న కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ గోవిందరాజులు అదే ఏడాది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు.

ఆరుసార్లు శిక్ష‌కు గురైనా..

ఇటీవల ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపిన‌ హైకోర్టు పని ప్రదేశంలో మహిళా ఉద్యోగలకు లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు తీసుకొచ్చిన చట్టం.. 2013 డిసెంబరు 9 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తుచేసింది. సుప్రీంకోర్టు ఓ కేసులో `విశాఖ మార్గదర్శకాలు` రూపొందించిందని తెలిపింది. గోవిందరాజులు సుప్రీం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడ‌ని స్పష్టంచేసింది. ఆయన 18 ఏళ్లు ఉద్యోగం చేశాడ‌ని, దుష్ప్రవర్తనకు పాల్పడిన ఆరోపణలో ఆరుసార్లు శిక్షకు గురయ్యాడ‌ని తెలిపింది. అయినా తన వైఖరిని మార్చుకోవడంలో విఫలమయ్యాడ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో అత‌ని పిటిష‌న్ కొట్టేస్తూ తీర్పు చెప్పింది.


First Published:  3 Sep 2023 3:23 AM GMT
Next Story